ఢిల్లీకి వెళ్లిన జూపల్లి.. నేడు కాంగ్రెస్​లో చేరిక

 ఢిల్లీకి వెళ్లిన జూపల్లి..	నేడు కాంగ్రెస్​లో చేరిక

 నాగర్​కర్నూల్, వెలుగు : కాంగ్రెస్​లో చేరేందుకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​రెడ్డి కొడుకు డా.రాజేశ్ రెడ్డి, కొడంగల్​ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్​రెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి తదితరులు తరలివెళ్లారు. బుధవారం సాయంత్రం ఏఐసీసీ ఆఫీస్​లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకోనున్నట్టు సమాచారం. కొల్లాపూర్​లో జులై 20,30 తేదీల్లో బహిరంగ సభ నిర్వహించి ఏఐసీసీ జనరల్​సెక్రటరీ ప్రియాంకగాంధీ సమక్షంలో పార్టీలో చేరాలని జూపల్లి, ఇతర నేతలు భావించారు. 

అయితే, వర్షాల కారణంగా సభను వాయిదా వేయాల్సి వచ్చింది. ఆగస్టు మొదటి వారంలో నిర్వహించాలని అనుకున్నా వాతావరణం అనుకూలించకపోవడంతో వెనక్కి తగ్గారు. చేరిక ఆలస్యమయ్యే కొద్దీ తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఫీడ్​బ్యాక్​తో పాటు కొల్లాపూర్​లోని పాత కాంగ్రెస్​లీడర్లు, కార్యకర్తలు ​జూపల్లిని పబ్లిక్​గా చాలెంజ్​చేసే వాతావరణం ఏర్పడుతుండడంతో ఢిల్లీ టూర్​ ఫిక్స్​ చేసుకున్నారని సమాచారం. టీపీసీసీ పెద్దలు కూడా ఇదే సలహా ఇవ్వడంతో జూపల్లి, ఇతర నేతలు పార్టీలో చేరేందుకు ఢిల్లీకి వెళ్లినట్లు తెలిసింది. వాతావరణం అనుకూలిస్తే కొల్లాపూర్​లో త్వరలోనే ప్రియాంకగాంధీ సభ నిర్వహించాలని స్టేట్​పార్టీ నిర్ణయించినట్టు సమాచారం.