- టూరిస్ట్ ప్రాంతాల్లో వసతుల కల్పనపై ఫోకస్ పెట్టాలి : మంత్రి జూపల్లి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని, టూరిస్ట్ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, నూతన ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్‌గా ఇటీవల నియమితులైన వాణి ప్రసాద్, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన పి.గౌతమి శుక్రవారం సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన అధికారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో పర్యాటక రంగానికి ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని చెప్పారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూపొందించిన ప్రతిపాదనలను వేగవంతం చేయాలని, కొత్త ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. పర్యాటక రంగం ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెంచడంతోపాటు స్థానికులకు ఉపాధి కల్పించేలా చర్యలు ఉండాలని అధికారులకు సూచించారు.
