ఇంటికి తాళం వేసి వెళ్తే చాలు.. 

ఇంటికి తాళం వేసి వెళ్తే చాలు.. 
  • రెక్కీ చేసి చోరీ చేస్తున్న దొంగ
  • హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 27 దొంగతనాలు

హైదరాబాద్: ఇంటికి తాళం వేసి కనిపిస్తే చాలు రెక్కీ చేసి.. మరీ దొంగతనం చేస్తున్నాడో నేరస్తుడు. ఒకటి కాదు.. రెండు కాదు.. 27 ఇళ్లలో దూరి ఎక్కడా ఆనవాళ్లు దొరక్కుండా చోరీలు చేసిన దొంగ ఎట్టకేలకు పోలీసులకు పట్టుపడ్డాడు. నిందితుడు పాతనేరస్తుడేనని తేలడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితుడి వద్ద నుంచి లక్షా 90 వేల రూపాయల నగదు, ఒక కిలో 850 గ్రాముల బంగారు ఆభరణాలు దొరికాయి. చోరీ కోసం ఇంట్లో దూరిన నిందితుడు డబ్బులు దొరక్కపోతే మొబైల్ ఫోన్ దొరికినా తీసుకుని వెళ్లిపోయేవాడని, నిందితుడిపై ఉన్న 27 కేసుల్లో ఏడు కేసులు కేవలం మొబైల్ చోరీ కేసులని రాచకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. చోరీలు చేస్తున్న నిందితుడితోపాటు అతని వద్ద చోరీ సొత్తును తీసుకుంటున్న వ్యక్తిని కూడా అరెస్టు చేశామని ఆయన తెలిపారు. 


పకడ్బందీగా చోరీ చేస్తున్న నిందితుడి గురించి సీపీ మహేష్ భగవత్ మీడియా సమావేశం నిర్వహించారు. తాళం వేసి ఉన్న ఇళ్లపై నిఘా పెట్టి రాత్రిపూట దొంగతనాలకు పాల్పడుతున్న కేసులు పెరిగిపోతుండడంతో ప్రత్యేక నిఘా ఉంచామని, ఎల్బీనగర్ సీసీఎస్ పరిధిలో ఈనెల 19వ తేదీన సరూర్ నగర్ లో పెద్ద దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధితులు  పెళ్లికి వెళ్లి వచ్చే సరికి  దొంగతనం జరిగిందని ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసుకొని దర్యా ప్తులో భాగంగా సీసీ కెమెరాల వివరాలు సేకరించి.. విశ్లేషించి .. మరికొన్ని చోట్ల దొరికిన ఆధారాలతో నిందితుడు పాత నేరస్తుడు గఫ్ఫార్ ఖాన్ అని గుర్తించామన్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని అతని వద్ద చోరీ సొత్తు, సొమ్ము తీసుకున్న సయ్యద్ ఖాజాపాషా ను అరెస్ట్ చేశామని వివరించారు. 
నిందితుడు గఫార్ ఖాన్ పై 2018 లో  హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మలక్ పేట్ పోలీసు స్టేషన్ లో పీడీ కేసు ఉందని, రాచకొండ పరిధిలో 3, సైబరాబాద్ లో 8, హైదరాబాద్ లో 10 కేసులు కేసులు ఉన్నాయని, మొత్తం 27 కేసుల్లో నిందితులుగా ఉన్నాడని తెలిపారు. నిందితుడు బైకుపై తిరిగి రెక్కీ చేస్తాడని, ఎక్కడెక్కడ తాళం వేసిన విల్లాలు ఉన్నాయా..? అని చూస్తాడు, కనిపించగానే రెక్కీ చేసి తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనాలు చేస్తాడని నిర్దారణ అయిందన్నారు. నిందితుడి నుంచి 1.90 లక్షల నగదు, కిలో 805 గ్రాముల బంగారం సొత్తు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. మొత్తం 27 దొంగతనాల కేసుల్లో 7 కేవలం మొబైల్ ఫోన్లు చోరీ కేసులేనని తెలిపారు. 
ఇప్పటికైనా అవకాశం ఉన్న వారంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఇంట్లో బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు ఉంటే బ్యాంకు లకర్స్ లో పెట్టుకోవాలని సీపీ మహేష్ భగవత్ సూచించారు. ఎవరైనా ఊరికి వెళ్తే పోలీసులకు సమాచారం ఇస్తే నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.