చీఫ్ జస్టిస్ గా​ ఉదయ్​ ఉమేశ్​ లలిత్..27న ప్రమాణం​

చీఫ్ జస్టిస్ గా​ ఉదయ్​ ఉమేశ్​ లలిత్..27న ప్రమాణం​

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ ఉదయ్​ ఉమేశ్​ లలిత్​ నియమితులయ్యారు. బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఫైల్​పై సంతకం చేశారు. దీంతో కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. భారత రాజ్యాంగంలోని 124వ ఆర్టికల్​ క్లాజ్ (2) ద్వారా అందించబడిన అధికారాలతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నియామకాన్ని చేపట్టినట్లు అందులో పేర్కొంది. కొత్త సీజేఐగా జస్టిస్​ యూయూ లలిత్​ పేరును ప్రస్తుత సీజేఐ ఎన్వీ రమణ వారం కిందే ప్రతిపాదించారు. ఆగస్టు 26న జస్టిస్​ ఎన్వీ రమణ పదవీ విరమణ చేస్తారు. 27న జస్టిస్​ యూయూ లలిత్​ బాధ్యతలు స్వీకరిస్తారు. బార్​ కౌన్సిల్​ సిఫార్సు ద్వారా సీజేఐగా పదోన్నతి పొందిన వారిలో జస్టిస్ యూయూ లలిత్ రెండో వారు. 1971లో అప్పటి 13వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎం సిక్రీ నియామకం కూడా బార్​ కౌన్సిల్​ సిఫార్సు ద్వారానే జరిగింది.  హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేయకుండా నేరుగా సుప్రీం కోర్టు జడ్జీగా బాధ్యతలు చేపట్టిన ఆరో వ్యక్తిగా కూడా జస్టిస్  యూయూ లలిత్​  రికార్డులో నిలిచారు. కాగా, జస్టిస్​ లలిత్​ కేవలం 74 రోజులు మాత్రమే సుప్రీం సీజేఐగా కొనసాగుతారు. 65 ఏండ్లు నిండుతుండటంతో నవంబర్​ 8న పదవీ విరమణ చేస్తారు.

కీలక తీర్పుల్లో భాగస్వామి

జస్టిస్‌‌ యూయూ లలిత్‌‌ 1957, నవంబర్‌‌ 9న జన్మించారు. ఆయన తండ్రి యూఆర్ లలిత్ సీనియర్ న్యాయవాదిగానూ, బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా సేవలందించారు. ఇక యూయూ లలిత్, 1983లో లీగల్‌‌ కెరీర్‌‌ను ప్రారంభించారు. 1985 డిసెంబర్‌‌ వరకు ముంబై హైకోర్టులో పనిచేశారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లారు. 2004, ఏప్రిల్‌‌లో సుప్రీం కోర్టు సీనియర్‌‌ న్యాయవాదిగా నియమితులయ్యారు. సుప్రీం కోర్టు జడ్జిగా నియమితులయ్యే వరకు సీబీఐ స్పెషల్​ అడ్వొకేట్​గా పని చేశారు. 2014, ఆగస్టు 13న సుప్రీం కోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చిన బెంచ్​లోని మెజార్టీ న్యాయమూర్తుల్లో లలిత్ ఒకరు. ఎన్నో కీలకమైన తీర్పులో జస్టిస్​ యూయూ లలిత్ భాగస్వామిగా ఉన్నారు.