- సర్కారు స్కూల్ స్టూడెంట్లకు ఈనెల11న ప్రదానం
- వివరాలు వెల్లడించిన బీసీటీఏ నాయకులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో చదివి పదో తరగతి ఫలితాల్లో మండల టాపర్లుగా నిలిచిన విద్యార్థులను బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ (బీసీటీఏ) ఘనంగా సన్మానించనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.కృష్ణుడు, ప్రధాన కార్యదర్శి ఏ.లక్ష్మణ్ గౌడ్ తెలిపారు. మహాత్మా జ్యోతిబాఫూలే ప్రతిభా పురస్కారాలు-–2026 పేరుతో అందిస్తామని చెప్పారు. ఈనెల11న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఈ సన్మాన కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో జరిగిన బీసీటీఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు.
రాష్ట్రంలోని మొత్తం 612 మండలాల నుంచి ప్రభుత్వ స్కూళ్లలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతోపాటు ఆయా స్కూళ్ల హెడ్మాసర్లను సన్మానించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంతోపాటు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎంపీలు ఆర్.కృష్ణయ్య, మల్లు రవి, ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య హాజరుకానున్నట్లు తెలిపారు.
