
- సోనియా గాంధీ సమక్షంలో చేరేందుకు యోచన
- కేశవరావు ఇంట్లో డిన్నర్.. హాజరైన సీఎం రేవంత్, దీపాదాస్ మున్షీ,
- వివేక్ వెంకట స్వామి, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ
హైదరాబాద్, వెలుగు: రెండు రోజుల క్రితమే బీఆర్ఎస్ను వీడిన సీనియర్ లీడర్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల 6న ఆయన కాంగ్రెస్కండువా కప్పుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని కేకే ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ వెళ్లారు. కేకే డిన్నర్ ఏర్పాట్లు చేయగా, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ, ఎమ్మెల్యేలు వినోద్, దానం నాగేందర్, సీనియర్ నేతలు జానా రెడ్డి, గీతా రెడ్డి హాజరయ్యారు. డిన్నర్ తర్వాత కేకే పార్టీలో చేరే అంశంపై చర్చ జరిగినట్టు తెలిసింది. కాగా, శనివారం ఉదయం దీపాదాస్ మున్షీ, రేవంత్ రెడ్డి సమక్షంలో కేకే కూతురు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెతో పాటు అల్విన్ కాలనీ కార్పొరేటర్ వెంకటేశ్ గౌడ్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కేకే కూడా పార్టీలో చేరే అంశంపై చర్చకు వచ్చినట్టు తెలిసింది. వచ్చే నెల 6న తుక్కుగూడలో కాంగ్రెస్ జన జాతర సభను నిర్వహిస్తున్న నేపథ్యంలో.. సోనియా గాంధీని ఆ సభకు ఆహ్వానిస్తున్నట్టు చెప్తున్నారు. దీంతో ఆమె సమక్షంలోనే సభ జరిగే రోజు ఉదయం ఓ హోటల్లో కాంగ్రెస్‌లో కేకే చేరుతారని తెలుస్తున్నది. అనంతరం సభలో పాల్గొంటారని పార్టీ వర్గాల సమాచారం. కాగా, తాను ఎవరిపైనా విమర్శలు చేయదల్చుకోలేదని డిన్నర్ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి అన్నారు. బీఆర్ఎస్ అందించిన ప్రోత్సాహం వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆమె చెప్పుకొచ్చారు.