బీసీ రిజర్వేషన్  న్యాయమైన డిమాండ్ : ప్రొఫెసర్ కోదండరాం

బీసీ రిజర్వేషన్  న్యాయమైన డిమాండ్ : ప్రొఫెసర్ కోదండరాం

ఖమ్మం టౌన్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్  అమలు చేయాలనేది న్యాయమైన డిమాండ్  అని తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్  కోదండరాం తెలిపారు. ఆదివారం ఖమ్మం సిటీలోని టీటీడీసీ భవనంలో టీజేఎస్  ఆధ్వర్యంలో 42 శాతం రిజర్వేషన్ సాధనపై సదస్సు నిర్వహించారు. సదస్సుకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేశ్​తో కలిసి హాజరై మాట్లాడారు. బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందటానికి రిజర్వేషన్  దోహదం చేస్తుందన్నారు.

మెజారిటీగా ఉన్న వర్గాలు సామాజిక, ఆర్థికరంగాల్లో అసమానతల కారణంగా ఇప్పటికీ చట్టసభల్లో న్యాయ సమ్మతమైన ప్రాతినిధ్యాన్ని పొందలేకపోయారని చెప్పారు. ఈ అన్యాయాన్ని సరిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్​లో చేర్చి పార్లమెంట్​లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్  చేశారు. అనంతరం భూదాన్  భూమిలో ఇండ్లు కోల్పోయిన బాధితులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రతి వ్యక్తికి సొంత ఇల్లు హక్కు అని, దానిని హరించే అధికారం ఎవరికీ లేదన్నారు. అధికారులు బాధితులను సమాచారం ఇవ్వకుండా ఖాళీ చేయించడం సరైంది కాదన్నారు. త్వరలో సీఎంను కలిసి ఈ విషయాన్ని చర్చిస్తానని హామీ ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు షేక్  సర్దార్  హుస్సేన్, ప్రధాన కార్యదర్శి జంగిపల్లి రవి, కూరపాటి రంగరాజు, చిర్రా రవి, నూనె భాస్కరరావు, ఫీట్ల స్వర్ణకుమార్, షేక్  మహబూబ్  పాషా పాల్గొన్నారు.