- కౌశిక్ రెడ్డి, గంగుల ఆఫీసులపై దాడులను ఖండించిన కేటీఆర్, హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: పట్టపగలు కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరులు గూండాల్లాగా తమ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, గంగుల కమలా కర్ క్యాంప్ ఆఫీసులపై దాడి చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వెహికల్స్ ను, ఆఫీస్‌ను ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్యని గురువారం ఓ ప్రకటనలో మండిపడ్డారు.
కండ్ల ముం దే ఇంత అరాచకం సృష్టిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం సిగ్గుచేటన్నారు. సీఎం రేవంత్‌కు బీటీమ్‌గా మారిన బండి సంజయ్.. బీఆర్ఎస్ నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే పిరికిపంద చర్యలకు ఉసిగొలుపుతున్నారని విమర్శించారు. ప్రతిసారి సీఎం వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు కుప్పిగంతులు వేయడం తప్ప కరీంనగర్ ప్రజలకు బండి సంజయ్ చేసిందేమీ లేదన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉండి తన అనుచరులతోనే శాంతి భద్రతలను దెబ్బతీసేలా వ్యవహరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన విమర్శించారు.
కాగా, ప్రజలు ఎన్నుకున్న నేతల క్యాంప్ ఆఫీసులపైనే ముప్పేట దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నట్టా.. లేనట్టా.. అని హరీశ్ రావు ప్రశ్నించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరమన్నారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొని, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు ఆపకపోతే.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు.
