కేసీఆర్ కుటుంబ పాలన మనకెందుకు..? : కేఏ పాల్

కేసీఆర్ కుటుంబ పాలన మనకెందుకు..? : కేఏ పాల్

టెక్నాలజీలో హైదరాబాద్ లాంటి సిటీ ప్రపంచంలోనే మరెఎక్కడా లేదని మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి అంటున్నారని, కానీ.. డ్రైనేజీ సిస్టం సరిగ్గా కట్టలేని స్థితిలో ఉన్నారంటూ మండిపడ్డారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. కోట్లు మింగి హైదరాబాద్ ను ముంచేశారని ఆరోపించారు. పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ కు తీసుకొచ్చామని చెబుతున్న మంత్రులు.. సిటీని మాత్రం వర్షం నుంచి కాపాడుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి గెలవమనే విషయం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలకు తెలుసని చెప్పారు. BRS నుంచి బయటకి వస్తే తమ ఇండ్లు, ఆఫీసులపై ఏసీబీ రైడ్స్ అవుతాయని భయపడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇటు బీజేపీలోని వాళ్లు కూడా పార్టీ మారితే ఈడీ, ఐటీ, రైడ్స్ అవుతాయని భయపడుతున్నారని చెప్పారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలంతా BRS, కాంగ్రెస్, బీజేపీ నుంచి బయటకు రావాలని కోరారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తన లైఫ్ లో మరోసారి ఎమ్మెల్యే, ఎంపీ కాలేరని చెప్పారు. తాను ముఖ్యమంత్రి అయితే..అందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తానన్నారు. నిరుద్యోగ భృతి రూ.6 వేలు ఇస్తానని చెప్పారు. కేసీఆర్ కుటుంబ పాలన మనకు ఎందుకని ప్రశ్నించారు. బీసీ నేత అయిన తనను ముఖ్యమంత్రి కావాలని చాలామంది కోరుకుంటున్నారని చెప్పారు. ఫారెన్ మినిస్టర్ పోస్ట్ ఇస్తామని కాంగ్రెస్, బీజేపీ ఆఫర్ చేస్తే తాను తిరస్కరించానన్నారు. 

మణిపూర్ ఘటనను రెండు వర్గాల మధ్య గొడవగా చూపిస్తున్నారే తప్ప.. అసలు నిజాన్ని మాత్రం చూపించట్లేదన్నారు. తాను తప్ప ఎవరూ మణిపూర్ ఘటనపై మాట్లాడడం లేదన్నారు. మణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు సీజేకు ఉత్తరం రాశానని చెప్పారు. ఇతర దేశాల నాయకులకు కూడా అక్కడి రాష్ర్ట పరిస్థితుల గురించి వివరించానని తెలిపారు. 

జులై 29 శనివారం రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాశాంతి పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ లతో సికింద్రాబాద్ లో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజాశాంతి పార్టీలో చేరాలనుకునే నాయకులు, కార్యకర్తలు తమ మీటింగ్ కు హాజరుకావాలని పిలుపునిచ్చారు.