వారం రోజుల్లో రాజయ్య క్షమాపణ చెప్పాలి : కడియం శ్రీహరి

వారం రోజుల్లో రాజయ్య  క్షమాపణ చెప్పాలి : కడియం శ్రీహరి

స్టేషన్ ఘన్ పూర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు  నువ్వా నేనా అంటూ పోటాపోటీ విమర్శలు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. 

తన కులంపై రాజయ్య  చేసిన వ్యాఖ్యలకు కడియం శ్రీహరి కౌంటర్ వేశారు. రాజయ్య మహిళాలోకాన్ని అవమానించేలా మాట్లాడారని విమర్శించారు.  తనపై, తన  కుటుంబంపై రాజయ్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు కడియం శ్రీహరి.  రాజయ్య వ్యాఖ్యలకు వివరణ ఇవ్వకపోతే ప్రజలు అపార్థం చేసుకుంటారని తెలిపారు.  రాజయ్య  కుటుంబ వ్యవస్థను అవమానించేలా వ్యాఖ్యానించారని.. ప్రతి ఒక్కరి తల్లిని అవమానించిండన్నారు. తనకు వేల కోట్ల ఆస్తులన్నట్లు రుజువు చేస్తే స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ దళితబిడ్డలకు రాసిస్తానని సవాల్ విసిరారు.  వారంలో రోజుల్లో తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయకపోతే రాజయ్య ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలన్నారు కడియం శ్రీహరి.

తన తండ్రి ఎస్సీ.. తల్లి బీసీ అని..తండ్రి కులమే పిల్లలకు వస్తుందని సుప్రీం కోర్టు చెప్పిందని కడియం  సూచించారు.  తండ్రి వరసత్వం ప్రకారం తాను ఎస్సీని అని చెప్పారు.  1994 కు ముందు రాష్ట్రంలో ఎన్ కౌంటర్లు లేవా? అని ప్రశ్నించారు కడియం. 2004 నుంచి 2014 మధ్య ఎక్కువ ఎన్ కౌంటర్లు జరిగాయని కడియం అన్నారు.  రాజయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ కౌంటర్లు లేవా? అని ప్రశ్నించారు.

రాజయ్యలో మార్పు వస్తుందని ఆశించా కానీ..రాజయ్య స్థాయి మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు కడియం.  రెండు ఎన్నికల్లో రాజయ్య గెలుపు కోసం పనిచేశానని..  అందుకే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నానని చెప్పారు కడియం శ్రీహరి.. రాజయ్య పార్టీ నియామవళిని పాటించడం లేదన్నారు.

కడియం అసలు  ఎస్సీనే కాదు: రాజయ్య

కడియం  శ్రీహరి  ఒక బ్లాక్ మెయిలర్ అని.. కడియం అస్సలు ఎస్సీనే కాదు అతను పద్మశాలి అని  రాజయ్య ఆరోపించారు.  ఎస్సీ రిజర్వేషన్లను కడియం అక్రమంగా వాడుకున్నారని వ్యాఖ్యానించారు.  కడియం ఎస్సీ అవునో కాదో ఆయనే  నిరూపించుకోవాలన్నారు.   దళిత దొరలా కడియం రాజ్యమేలుతున్నారని ధ్వజమెత్తారు . కడియంపై దళిత సంఘాలు  పోరాటం చేయాలన్నారు.   బాబు వెన్నుపోటు దారులో కడియంది ప్రధాన పాత్ర అని.. 14 ఏళ్లు మంత్రిగా ఉన్నా ఘన్ పూర్ కు  కడియం చేసిందేమి లేదన్నారు.