నిజామాబాద్లో రసవత్తరంగా కాకా వెంకటస్వామి క్రికెట్ టోర్నీ

నిజామాబాద్లో రసవత్తరంగా కాకా వెంకటస్వామి క్రికెట్ టోర్నీ
  • కాకా వెంకటస్వామి క్రికెట్ టోర్నీని ప్రారంభించిన ఏసీపీ రాజావెంకట్​రెడ్డి  
  • మొదటి మ్యాచ్​లో గెలిచిన కామారెడ్డి టీం
  • రెండో మ్యాచ్​లో గెలిచిన నిజామాబాద్ టీం
  • నేడు ఫైనల్​మ్యాచ్, హాజరుకానున్న ఎమ్మెల్యే భూపతిరెడ్డి 

నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్​లోని గిరిరాజ్​ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గురువారం కాకా వెంకటస్వామి క్రికెట్​టోర్నీ రసవత్తరంగా కొనసాగింది. పోటీలను ఏసీపీ రాజా వెంకట్​రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో తెలంగాణలో క్రికెట్​కు ఆదరణ పెరిగిందని, ఎందరో యువ క్రీడాకారులు వెలుగులోకి వచ్చారన్నారు. మంత్రికి క్రీడలంటే ఎనలేని అభిమానమని, క్రికెట్ క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. 

 క్రీడాకారులు ప్రతిభను చూపి యువకుల్లో స్ఫూర్తిని నింపాలని సూచించారు. నేడు ఫైనల్​ మ్యాచ్  నిజామాబాద్ వర్సెస్​కామారెడ్డి  మధ్య జరగనున్నది. ఈ ముగింపు వేడుకలకు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి హాజరుకానున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో సెక్రటరీ వెంకట్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ సురేష్ బాబు, సీనియర్ ప్లేయర్ చంద్రసేనారెడ్డి,  క్రీడాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

ఉత్కంఠగా క్రికెట్ పోటీ.. 

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల జట్ల మధ్య క్రికెట్​ పోటీ ఉత్కంఠగా సాగింది. మొదటి మ్యాచ్​నిజామాబాద్, కామారెడ్డి జట్ల మధ్య జరిగింది. నిజామాబాద్ టీం టాస్​గెలిచి బ్యాటింగ్​ ఎంచుకుంది. 20 ఓవర్లలో 179 పరుగులు చేశారు. కామారెడ్డి జిల్లా టీం 18.2 ఓవర్లలో 180 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది. కామరెడ్డి టీం కు చెందిన ఎం. రిత్విక్ రాజ్ గౌడ్ (77)  పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్  దక్కించుకున్నాడు.

 రెండో మ్యాచ్ కామారెడ్డి, నిజామాబాద్ జట్ల మధ్య జరగగా కామారెడ్డి టీం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 88 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం నిజామాబాద్ టీం బ్యాటింగ్ చేయగా నాలుగు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసి విజయం సాధించింది. నిజామాబాద్​ టీం చెందిన  నారాయణ్ 4  ఓవర్లలో నాలుగు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ 
దక్కించుకున్నాడు.