టెస్టులు చేశాకే డిజైన్లు!..మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలో సీడీవో యోచన

టెస్టులు చేశాకే డిజైన్లు!..మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలో సీడీవో యోచన
  • డ్యామేజీతో నేల పరిస్థితులు మారినట్లు అభిప్రాయాలు
  • ఎన్డీఎస్ఏ సూచనల మేరకే ముందుకెళ్లేలా కసరత్తు 
  • టెస్టులు చేసేందుకు సీడబ్ల్యూపీఆర్ఎస్ ​సంసిద్ధత 

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు టెస్టులు చేసిన తర్వాతే డిజైన్లను తయారు చేయించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై సర్కార్‌‌.. సెంట్రల్​డిజైన్స్​ఆర్గనైజేషన్​(సీడీవో) రెస్పాన్స్​కోరింది. ఈ నేపథ్యంలోనే టెస్టులు చేయనిది? అక్కడ భూమి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియనిది? డిజైన్లు తయారు చేసే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. మేడిగడ్డ కుంగిపోవడంతో అక్కడ పూర్తిగా నేల పరిస్థితులు మారిపోయాయని అంటున్నారు. 

ఇటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ సీపేజీల సమస్య తీవ్రంగా ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే అక్కడ కొత్తగా డిజైన్లు చేయాలంటే శాస్త్రీయంగా ఇన్వెస్టిగేషన్స్​చేయించాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) తన తుది నివేదికలో మూడు బ్యారేజీలకు సంబంధించి 8 టెస్టులను సిఫార్సు చేసింది. ఆ సిఫార్సుల మేరకు అక్కడ టెస్టులు చేసి.. రిపోర్టు వచ్చాకే ముందుకు వెళ్లాలని సీడీవో భావిస్తున్నది. ఈ క్రమంలోనే సెంట్రల్​వాటర్ పవర్ రీసెర్చ్​స్టేషన్​(సీడబ్ల్యూపీఆర్ఎస్) నిపుణులు అక్కడ టెస్టులు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. డిజైన్ల విషయానికి సంబంధించి త్వరలోనే ప్రభుత్వానికి సీడీవో తరఫున వివరణ ఇవ్వనున్నట్టు తెలిసింది. 

వరదలు రాక ముందే టెస్టులు..

ప్రస్తుతం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద వరద ప్రవాహం ఉన్నది. అక్కడ ఎన్డీఎస్ఏ సిఫార్సు చేసిన జియోటెక్నికల్​ఇన్వెస్టిగేషన్స్​చేసేందుకు అవకాశం లేకుండా పోతున్నదని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి వరదలు ప్రారంభమవడానికి ముందే సీడబ్ల్యూపీఆర్ఎస్​ నిపుణులు.. మూడు బ్యారేజీలను పరిశీలించినట్టు తెలిసింది. అన్నారం బ్యారేజీ వద్ద ఒక బోర్‌‌హోల్‌నూ తవ్వినట్టు సమాచారం. అయితే కాంక్రీట్‌ను దాటి కొంచెం లోపలికి హోల్ చేయగానే పైకి భారీగా నీళ్లు ఎగజిమ్మినట్టు చెబుతున్నారు. దీంతో ఎక్కువ లోతుకు బోర్​వేయకుండానే సీడబ్ల్యూపీఆర్ఎస్ ​నిపుణులు వెనుదిరిగినట్టు తెలిసింది.

 సీకెంట్​ పైల్స్​ఫౌండేషన్​ ఉన్న చోట నీటి నిల్వలు, ఊటలు ఉండడంతోనే అక్కడ బోర్​హోల్స్​ వేయడం సాధ్యం కాలేదని చెప్పినట్టు తెలిసింది. అక్కడ మొత్తం డ్రైగా మారిన తర్వాతే టెస్టులు చేయడానికి సాధ్యపడుతుందని చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం వరద అయిపోయాకే టెస్టులు చేసేందుకు వీలవుతుందని, రిపోర్టులు వచ్చేంత వరకు డిజైన్లను ఫైనలైజ్​ చేయలేని పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, సీడబ్ల్యూపీఆర్ఎస్​ నిపుణులు మరోసారి బ్యారేజీలను పరిశీలించేందుకు రాష్ట్రానికి వస్తున్నట్టు తెలిసింది. అక్కడ పరిస్థితులను చూశాక ప్రభుత్వానికి వివరించనున్నట్టు అధికారులు చెబుతున్నారు.