కాళేశ్వరం బాధ్యులను ..  ఎందుకు అరెస్ట్ చేయట్లే: బండి సంజయ్

కాళేశ్వరం బాధ్యులను ..  ఎందుకు అరెస్ట్ చేయట్లే: బండి సంజయ్
  •     కూలిపోయే ప్రమాదముందన్నా ఎందుకు చర్యలు తీసుకోవట్లే?
  •     కొనసాగుతున్న బండి సంజయ్​ప్రజాహిత యాత్ర  

రాజన్నసిరిసిల్ల,వెలుగు : కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథా రిటీ బృందం అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిందని, నివేదిక రూపొందించి చర్యలు తీసుకోవాలని కోరినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ప్రాజెక్టు ద్వారా రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిన కేసీఆర్, ఇతర బాధ్యులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని, వారి ఆస్తులను ఎందుకు జప్తు చేయడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాహిత యాత్రలో భాగంగా బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాల్లో బండి సంజయ్​ పర్యటించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్​లు కాళేశ్వరం, క్రిష్ణా నీటి పంపకాల పేరుతో తిట్టుకుంటూ డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. గంభీరావుపేటలో మాట్లాడుతూ అయోధ్యలోనే రామ మందిరం ఎందుకు కట్టారని వితండ వాదం చేస్తున్న నేతలంతా చరిత్ర తెలుసుకోవాలన్నారు. ఇంకా మాట్లాడితే ప్రజల కోరిక మేరకు దేశంలో అనేక ఆలయాలను నిర్మిస్తామన్నారు. 

నన్న గెలకొద్దు..అంతు చూస్తా 

‘నా గురించి స్వయం ప్రకటిత అపర మేధావి అవాకులు చవాకులు పేలుతున్నడు. నన్ను గెలకొద్దు.. గెలికితే అంతు చూస్తా..గచ్చిబౌలిలో రూ.500 కోట్ల విలువ చేసే 6 ఎకరాల భూదాన్ భూములను అక్రమంగా మీ వాళ్ల పేరు మీద ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నవో తెలుసు’ అంటూ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పై సంజయ్​ఫైర్ అయ్యారు. బోయినిపల్లి మండలం నర్సింగా పూర్​లో 20 ఎకరాల సింగిల్ బిట్​ను ఎవరి పేరు మీద కొన్నారో తెలుసునన్నారు. హైదరాబాద్​లోని బంజారాహిల్స్ లోటస్ పాండ్ సమీపంలో ఉన్న విశాలమైన భవంతిలో అధికారులను పిలిపించుకుని సాగిస్తున్న దందాలు కూడా తెలుసన్నారు. తన జోలికి వస్తే బాగోతమంతా బయటపెట్టాల్సి ఉంటుందన్నారు.  అబద్దాలు, మోసాల్లో కేటీఆర్ అయ్యను మించిపోయిండన్నారు. కేసీఆర్ ఓ పిరికిపంద అని బీజేపీ కార్యకర్తలంటే గజగజ వణికిపోతున్నాడన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ, ఎస్సీమోర్చా స్టేట్ జనరల్​ సెక్రటరీ కుమ్మరి శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, ప్రభాకర్  ఉన్నారు.