కాళేశ్వరం క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మార్మోగిన దక్షిణ కాశీ

కాళేశ్వరం క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మార్మోగిన దక్షిణ కాశీ

మహదేవపూర్, వెలుగు: దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వర క్షేత్రం భక్తుల శివనామస్మరణతో మార్మోగుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద సరస్వతీ అంత్య పుష్కర స్నానాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. సోమవారం శివుని వారం కావడంతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఆదిలాబాద్‌‌కు చెందిన శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం పీఠాధిపతి శ్రీయోగానంద సరస్వతి స్వామీజీ కూడా పుష్కర స్నానం చేసి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. వడదెబ్బ బారిన పడకుండా సదుపాయాలు కల్పించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం ఆలయాన్ని ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచుతున్నట్లు ఈవో తెలిపారు. 

త్రివేణి సంగమం వద్ద భద్రత చర్యలను కూడా కట్టుదిట్టం చేశారు. నదిలోపలికి భక్తులు వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు గజఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ బృందాలు, బోట్లు అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. 

సరస్వతి పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్, స్టాళ్లు చిన్నారులను ఆకట్టుకుంటున్నాయి. రాత్రివేళ నిర్వహిస్తున్న తెప్పోత్సవం, గోదావరి హారతిని తిలకించేందుకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.