‘కాళేశ్వరం’ ఆర్థికంగా పెనుభారం.. ఒక్క ఎకరాపై రూ.8.12 లక్షలు వ్యయం

‘కాళేశ్వరం’ ఆర్థికంగా పెనుభారం.. ఒక్క ఎకరాపై రూ.8.12 లక్షలు వ్యయం
  • ఏటా విద్యుత్‌‌ చార్జీలే రూ.3,555 కోట్లు
  • కమిషన్‌‌ ఏర్పాటు చట్టబద్ధమే
  • దానిని సవాల్‌‌ చేయడంలో అర్థం లేదు
  • కేసీఆర్‌‌ పిటిషన్‌‌ను కొట్టేయండి
  • హైకోర్టులో అడ్వకేట్‌‌ జనరల్‌‌ వాదనలు

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థికంగా పెను భారమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీభారం అధికంగా పడుతోందని సర్కారు తరఫున అడ్వకేట్‌‌ జనరల్‌‌ సుదర్శన్‌‌రెడ్డి చెప్పారు. జీవో 6 ద్వారా జస్టిస్‌‌ పీసీ ఘోష్‌‌ కమిషన్‌‌ను ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, అప్పటి ఇరిగేషన్‌‌ శాఖ మంత్రి హరీశ్ రావు, ఐఏఎస్‌‌ ఆఫీసర్‌‌ స్మితా సభర్వాల్, రిటైర్డు ఐఏఎస్‌‌ ఎస్‌‌కే జోషి దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం విచారణ కొనసాగింది.

అడ్వకేట్‌‌ జనరల్‌‌ సుదర్శన్‌‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.81.91 వేల కోట్ల నుంచి రూ.1.47 లక్షల కోట్లకు పెంచారని, ఇది ఒక ఎకరాకు రూ.8.12 లక్షల పెట్టుబడి పెట్టినట్టని వివరించారు. అదనంగా 5,643 మిలియన్‌‌ యూనిట్లకు విద్యుత్తు వినియోగం పెరిగిందన్నారు. దీని వల్ల ఏటా రూ.3,555.34 కోట్లు విద్యుత్తు చార్జీలు పెరిగాయని చెప్పారు. విద్యుత్‌‌ వాడకం బాగా పెరగడంతో ప్రభుత్వానికి ఆర్థికంగా భారం అవుతోందన్నారు. 

దురుద్దేశంతో కమిషన్‌‌ ఏర్పాటు చేయలేదు
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం జరిగిన తీరుతెన్నులు, మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలు తేల్చేందుకు కమిషన్‌‌ ఏర్పాటు చేసినట్లు ఏజీ సుదర్శన్​రెడ్డి చెప్పారు. దురుద్దేశంతో కమిషన్‌‌ ఏర్పాటు చేయలేదన్నారు. మేడిగడ్డ బ్యారేజీ బీటలువారడంపై జస్టిస్‌‌ పీసీ ఘోష్‌‌ కమిషన్‌‌ విచారణకు హాజరైన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఇతరులు ఇప్పుడు ఆ కమిషన్‌‌ ఏర్పాటును సవాల్‌‌ చేయడంలో అర్థం లేదన్నారు.

కేసీఆర్‌‌ పిటిషన్‌‌పై ఏజీ సుదర్శన్‌‌రెడ్డి వాదనలు కొనసాగిస్తూ, కమిషన్‌‌ ఆఫ్‌‌ ఎంక్వైరీస్‌‌ యాక్ట్‌‌ సెక్షన్‌‌ 3 ప్రకారం కమిషన్‌‌ ఏర్పాటు అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. ఉమ్మడి ఏపీలో ఏలేరు కమిషన్‌‌ ఏర్పాటు చేయడాన్ని సుప్రీంకోర్టు సమర్ధించిందని గుర్తుచేశారు. ప్రజాధనంతో నిర్మాణం జరిగిన మేడిగడ్డ కుంగుబాటుపై కమిషన్‌‌ ఏర్పాటు చట్టబద్ధమేనని అన్నారు.

నేషనల్‌‌ డ్యాం సేఫ్టీ అథారిటీ రిపోర్టులో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో సరైన డిజైన్‌‌ లేదని చెప్పిందన్నారు. నిర్మాణం, నిర్వహణలో లోపాలు, నిర్లక్ష్యం ఉన్నట్టు కూడా తేల్చిందన్నారు. ప్రాజెక్టు కోసం చేసిన ఖర్చులు గిట్టుబాటు కాదని కాగ్‌‌ రిపోర్టు ఇచ్చిందన్నారు. అప్పటికే కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణను ఈ నెల 5వ తేదీకి వాయిదా వేస్తూ చీఫ్‌‌ జస్టిస్‌‌ అపరేశ్‌‌ కుమార్‌‌ సింగ్, జస్టిస్‌‌ జీఎం మొహియుద్దీన్‌‌ డివిజన్‌‌ బెంచ్‌‌ ఉత్తర్వులు జారీ చేసింది.