- జీవో 31 వెంటనే రద్దు చేయాలని డిమాండ్
- రైతులు ఆమోదం లేకుండా భూములు గుంజుకున్నరు.. తిరిగి ఇవ్వాలని ఫైర్
- ఫ్యూచర్ సిటీ పేరుతో మోసం చేస్తున్నారని విమర్శ
- కోర్టులో స్టే ఉన్నా గత ప్రభుత్వం భూములు లాక్కుందని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల విషయంలో రైతుల పక్షాన రణం చేస్తామని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. రైతుల అంగీకారం లేకుండా సేకరించిన భూములను తిరిగి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో “ఫార్మా సిటీలో ఏం జరుగుతోంది” అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫార్మా సిటీ భూసేకరణ కోసం తీసుకొచ్చిన జీవో 31ను వెంటనే రద్దు చేయాలని కవిత డిమాండ్ చేశారు.
ఫార్మా సిటీ భూముల విషయంలో గత ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందని, అదే విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తోందని ఆమె విమర్శించారు. గత ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం జీవో 31ను తీసుకొచ్చిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ జీవోను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పిందని కవిత అన్నారు. జీవో 31ను రద్దు చేయకపోగా ఫ్యూచర్ సిటీ పేరుతో భూసేకరణను 13,500 ఎకరాల నుంచి 30 వేల ఎకరాలకు పెంచారని విమర్శించారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన 13,500 ఎకరాల్లో కందుకూరు మండలంలో 3,500 ఎకరాలు, యాచారం మండలంలో 6,500 ఎకరాలు అసైన్డ్ భూములేనని తెలిపారు.
వాటిపై కోర్టులో స్టే ఉన్నప్పటికీ గత ప్రభుత్వం భూములను సేకరించిందని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం కోర్టులో ఫార్మా సిటీ కొనసాగిస్తామని చెబుతూనే బయట ఫ్యూచర్ సిటీ పేరుతో భూసేకరణ చేపడుతోందని విమర్శించారు. ఎకరాకు రూ.8 లక్షల పరిహారం మాత్రమే ఇస్తామని చెబితే రైతుల జీవనోపాధి ఎలా సాగుతుందో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. మొండిగా ఉన్న ప్రభుత్వాలను దించాలంటే గట్టిగా పోరాటం చేయాల్సిందేనని ఆమె అన్నారు.ప్రశ్నించడం, పోరాడటం, పరిష్కారం సాధించడం అనే విధానంతో తాము ముందుకు వెళ్తున్నామని, ఫార్మా సిటీ బాధిత రైతుల సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
ఫ్యూచర్ సిటీ ఓ మోసం..
ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్సర్కార్ప్రజలను మోసం చేస్తోందని కవిత ఆరోపించారు. బుల్లెట్ ట్రైన్ వస్తోందని, రూ.6 లక్షల కోట్ల ఎంఓయూలు, డేటా సెంటర్లు అంటూ అబద్ధాల పునాదులపై ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. డేటా సెంటర్ల వల్ల వచ్చే శబ్ద కాలుష్యంతో పక్షులు కూడా బతకలేని పరిస్థితి వస్తుందని అన్నారు. అమెరికా లాంటి దేశాలు డేటా సెంటర్లు పెట్టటం లేదని చెప్పారు. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నాలు చేస్తోందని ఆమె ఆరోపించారు.
ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో రైతుల ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదని సీఎం వ్యాఖ్యానించారని తెలిపారు. పంటల కొనుగోళ్లపై ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసిందని, ఈ ఏడాది కొనుగోళ్లు కొనసాగించాలని కమిటీ సూచించిందని చెప్పారు. అయితే వచ్చే ఏడాది నుంచి కొనుగోళ్లు నిలిపివేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని కవిత ఆరోపించారు.
