- జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
ఉప్పల్, వెలుగు: గత ఎనిమిదేండ్లుగా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని, పరిస్థితి మారటం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం ఉప్పల్, రామంతాపూర్ ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. కేంద్ర-, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడం, స్థానిక ఎంపీలు ప్రత్యేక దృష్టి పెట్టకపోవడమే ఈ పరిస్థితికి కారణమని విమర్శించారు. అనంతరం రామంతాపూర్ కురుమనగర్లో ఎస్టీపీ పనులను పరిశీలించారు. కాలనీవాసులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్న ఈ పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్చేశారు. కాలనీవాసులకు మద్దతుగా ఉంటామని చెప్పారు.
విద్యుత్ ప్రమాద బాధితులకు పరామర్శ
రామంతాపూర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా జరిగిన ర్యాలీలో విద్యుత్ ప్రమాదం కారణంగా మృతి చెందిన బాధిత కుటుంబాలను గురువారం ఆమె పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో గోపు సదానంద్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
అల్వాల్: అల్వాల్ వెంకటాపురం డివిజన్ భూదేవి నగర్ లోనూ ఆమె పర్యటించారు. అక్కడి ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఇక్కడి పేదలకు కనీసం బాత్రూములు, మరుగుదొడ్లు లేవని, తెలంగాణ జాగృతి తరఫున తాము కట్టిస్తామని మాటిచ్చారు. పాలమూరు ప్రజలు ఎక్కువగా ఉంటున్న ఈ ప్రాంతంపై సీఎం రేవంత్రెడ్డి దృష్టి సారించాలని కోరారు.
