కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో కమల్‌‌‌‌‌‌‌‌నాథ్​కు కీ రోల్?

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో కమల్‌‌‌‌‌‌‌‌నాథ్​కు కీ రోల్?
  • పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌గా నియమితులయ్యే చాన్స్
  • త్వరలో పార్టీ పార్లమెంటరీ స్ట్రాటజిక్ గ్రూపు భేటీ
  • సోనియాకు శాశ్వత ప్రెసిడెంట్​గా బాధ్యతలు 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో త్వరలో కీలక మార్పులు జరిగే సూచనలు కన్పిస్తున్నాయి. మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం త్వరలోనే పార్టీ పార్లమెంటరీ స్ట్రాటజిక్ గ్రూపు సమావేశం జరగనుందని, ఈ సమావేశంలోనే ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకునే అవకాశం ఉందన్న ఊహాగానాలు సాగుతున్నాయి. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత పార్టీ ప్రెసిడెంట్ పదవికి రాహుల్ గాంధీ రిజైన్ చేశారు. అప్పటి నుంచి సోనియా ఇంటెరిమ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆమెను పర్మనెంట్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోనున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గాంధీ కుటుంబానికి నమ్మకస్తుడైన కమల్ నాథ్ పార్టీలో అనేక సార్లు ట్రబుల్ షూటర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండటం, 2024లో లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ నాయకత్వంలో మార్పులు జరగనున్నాయని చెప్తున్నారు. 

లోక్‌‌‌‌‌‌‌‌సభలో కాంగ్రెస్ నేతగా రాహుల్ గాంధీ
ప్రస్తుతం లోక్ సభలో కాంగ్రెస్ సభాపక్ష నేతగా ఉన్న ఆధిర్ రంజన్ చౌధరి స్థానంలో రాహుల్ గాంధీకి బాధ్యతలు అప్పగించనున్నారన్న ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో సాగుతోంది. సోమవారం నుంచే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలోపే రాహుల్ ను లోక్ సభలో కాంగ్రెస్ లీడర్ గా ఎన్నుకోనున్నారని చెప్తున్నారు. అయితే ఈ బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ ఒప్పుకుంటారా? లేదా? అన్నదానిని బట్టే పార్టీ లీడర్ మార్పు ఉండబోతోందన్న చర్చ కూడా జరుగుతోంది.