V6 News

అంబేద్కర్ ఆశయాలను పాలకులు నీరుగారుస్తున్నరు : కంచ ఐలయ్య షఫర్డ్ ఫైర్

అంబేద్కర్ ఆశయాలను పాలకులు నీరుగారుస్తున్నరు : కంచ ఐలయ్య షఫర్డ్ ఫైర్
  • ఆయన ఆలోచనలను వారికి నచ్చినట్లుగా మార్చుకుంటున్నరు: కంచ ఐలయ్య షఫర్డ్ ఫైర్​
  • నేడు అంబేద్కర్‌‌  ‘వెబ్ టీవీ, రేడియో’ షురూ: ఘంటా చక్రపాణి

హైదరాబాద్, వెలుగు: దేశంలో ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం ఉంటేనే సామాజిక మార్పు సాధ్యమవుతుందని ప్రముఖ సామాజిక విశ్లేషకులు ప్రొఫెసర్ కంచ ఐలయ్య షఫర్డ్ స్పష్టం చేశారు. నేటి పాలకులు అంబేద్కర్ ఆలోచనలను తమకు నచ్చినట్లు మార్చుకుంటూ ఆయన ఆశయాలను నీరుగారుస్తున్నారని ఫైర్​అయ్యారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ‘బౌద్ధేతర భావజాలాలు అంబేద్కర్‌‌ను తనవైపు తిప్పుకోగలవా’ అనే అంశంపై నిర్వహించిన స్మారక ఉపన్యాసంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు.

 కుల వివక్షను అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. హిందూ మతంలో సంస్కరణలకు తావులేదని, ఇస్లాం, క్రైస్తవాల్లోనూ పరిమితులు ఉన్నాయని భావించే అంబేద్కర్.. సమానత్వం, హేతుబద్ధత ఉన్న నవ-బౌద్ధాన్ని స్వీకరించారని వివరించారు. నేటి పాలకులు విద్యను, శ్రమ గౌరవాన్ని విస్మరిస్తున్నారని.. ఉత్పత్తి వ్యవస్థల్లో ఆదివాసీల కృషిని గుర్తించాలన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే  ప్రజాస్వామ్యం బతుకుతదని స్పష్టం చేశారు.  

బౌద్ధం, విద్య, సాంకేతికతతోనే అభివృద్ధి: వీసీ

బౌద్ధం, విద్య, సాంకేతికతతోనే సామాజిక మార్పు సాధ్యమని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. బుద్ధుని సూత్రాలతో దేశాన్ని ఐక్యం చేయవచ్చని, సామాజిక న్యాయానికి బౌద్ధమే మార్గమని అంబేద్కర్ పేర్కొన్నారని గుర్తు చేశారు. అణగారిన వర్గాలను అభివృద్ధి చేసే శక్తి విద్యకు మాత్రమే ఉందని, దానికి సాంకేతికతను జోడించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగానే విద్యార్థుల కోసం ఏప్రిల్14న వెబ్ ఆధారిత టీవీ, రేడియో వేదికలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ర్టార్ ఎల్ విజయకృష్ణరెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ పుష్ప చక్రపాణి, ఎన్​సీ వేణుగోపాల్, ఆనంద్ పవార్, సుధారాణి తదితరులు పాల్గొన్నారు.