- ఇద్దరి కోసం వారం రోజులుగా గాలిస్తున్న కరీంనగర్ పోలీసులు
- జైలులో ఉన్నట్లు తెలియడంతో ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ పై తీసుకొచ్చేందుకు చర్యలు
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ లో సంచలనం సృష్టించిన భగత్ నగర్ దోపిడీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారులైన మహ్మద్ రజావుద్దీన్, అతడి కుమారుడు మహ్మద్ అజీమ్ రజా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పాత కేసుల్లో కోర్టుల్లో లొంగిపోయి జైలుకెళ్లారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేయగా.. నిందితుల వివరాలను అడిషనల్ డీసీపీ వెంకటరమణ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. కరీంనగర్‌లోని భగత్‌నగర్‌కు చెందిన ఎండీ అజ్మత్ అలీ ఇంట్లో ఈ నెల 21న దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో బాధితుడి అల్లుడు మహ్మద్ రజావుద్దీన్, మనవడు మహ్మద్ అజీమ్ రజానే చోరీకి ప్లాన్ చేసినట్లు తేలింది. వీరిద్దరు యూపీకి చెందిన సల్మాన్ అలియాస్ భూరే, సల్మాన్ అలియాస్ విమాన్, మహ్మద్ హాసిన్ సహకారంతో ఈ దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. దీంతో మీరట్ పోలీసుల సాయంతో ముగ్గురినీ అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.2.09 లక్షలు, 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు, 64.98 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కానీ ప్రధాన నిందితులైన రజావుద్దీన్, అతడి కుమారుడు అజీమ్ రజా జాడ తెలియరాలేదు. ఈ క్రమంలోనే వారిపై హత్య, ఆర్మ్స్ కేసులపై ఆరా తీశారు. ఈ క్రమంలో కరీంనగర్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకునేందుకు వారు తమ పాత కేసుల్లో బెయిల్ ష్యూరిటీలను క్యాన్సిల్ చేయించుకుని మీరట్‌లోని కోర్టు ముందు లొంగిపోయినట్లు గుర్తించారు. దీంతో వారిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించగా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జైలులో ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్లపై కరీంనగర్‌కు తీసుకొచ్చేందుకు అవసరమైన పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చాక ఇద్దరినీ కరీంనగర్‌కు తీసుకువచ్చేందుకు చర్యలు
తీసుకుంటున్నారు.
