కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలో గురువారం నుంచి లోకల్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. కరీంనగర్ సిటీ చుట్టూ ఏడు కిలోమీటర్ల మేర విస్తరించిన నేపథ్యంలో సిటీవాసుల రాకపోకలకు వీలుగా ఈ సర్వీసులను తీసుకొస్తున్నారు. తొలుత కరీంనగర్ 2 డిపో పరిధిలో మూడు సర్వీసులను మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గురువారం సాయంత్రం ప్రారంభించనున్నారు.
కరీంనగర్ వాగేశ్వరి కాలేజీ, కరీంనగర్ చింతకుంట, కరీంనగర్– కొత్తపల్లి హవేలీ రూట్లలో సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులను నడుపనున్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని రూట్లకు సిటీ బస్సు సేవలను విస్తరించనున్నారు.
