- బెంగాల్‌లో ఒకరు,
- బిహార్‌లో మరొకరు పట్టుబడినట్లు సమాచారం
- మిగతా ముగ్గురు నిందితుల కోసం గాలింపు
- బంగారం కొనుగోలు చేసిన వ్యాపారిని గుర్తించిన పోలీసులు
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ పట్టణంలోని పీఎంజే జ్యువెల్లరీ షాపులో జరిగిన కిలోన్నర బంగారం దోపిడీ కేసు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. దోపిడీ ముఠా కోసం గాలిస్తున్న ప్రత్యేక బృందాలకు బెంగాల్‌లో ఒకరు, బిహార్‌లో మరో దొంగ చిక్కినట్లు సమాచారం. విచారణ సమయంలో వారిచ్చిన సమాచారం ఆధారంగా మిగతా ముగ్గురి కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు తెలిసింది. పట్టుబడిన దొంగలు ఇచ్చిన సమాచారంతో బంగారం కొనుగోలు చేసిన వ్యాపారిని సైతం పట్టుకొని కొంత బంగారాన్ని రికవరీ చేసినట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర టు బిహార్ వయా చత్తీస్‌గఢ్
ఈ నెల 3న ఆదివారం పట్టపగలే ఐదుగురు దొంగలు కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెల్లరీ షాపులోకి చొరబడి పిస్టల్స్‌తో స్టాఫ్‌ను బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన నలుగురు సిబ్బందిపై కాల్పులు జరిపి కిలోన్నరకుపైగా బంగారం ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. చోరీ అనంతరం పల్సర్, అపాజీ బైక్‌లపై జగిత్యాల జిల్లా ధర్మపురికి చేరుకుని ఒక బైక్‌ను అక్కడే వదిలేశారు. రెండు రోజుల తర్వాత గోదావరి నదిలో బైక్‌ను గుర్తించిన పోలీసులు.. దొంగలు మహారాష్ట్ర వైపు పరారైనట్లు అనుమానించారు. అనుకున్నట్లుగానే ఈ దొంగల ముఠా తొలుత మహారాష్ట్రకు ఆ తర్వాత చత్తీస్‌గఢ్, జార్ఖండ్ మీదుగా బిహార్‌కు చేరుకున్నట్లు తెలిసింది. పోలీసులు వెంటాడతున్నారని గ్రహించిన దొంగలు ఎక్కడా ఆగకుండా ప్రయాణం సాగించినట్లు సమాచారం. ఇలా మూడు రోజుల్లోనే సొంత రాష్ట్రం బిహార్‌కు చేరుకున్నట్లు తెలిసింది.
దొంగల కంటే ముందే బిహార్‌కు రాష్ట్ర పోలీసులు
ముఠా సభ్యులంతా పాత నేరస్తులే కావడం, బిహార్‌కు చెందినవారని నిర్ధారణకు వచ్చిన కరీంనగర్ పోలీసులు.. దొంగల కంటే ముందే బిహార్‌కు చేరుకున్నట్లు తెలిసింది. దొంగలు తమ ఏజెంట్ల ద్వారా బంగారాన్ని త్వరగా క్యాష్‌గా మార్చుకుంటారన్న అనుమానంతో.. ఈ ముఠాతో సంబంధం ఉన్న నగల వ్యాపారులపై నిఘా పెట్టినట్లు సమాచారం, ఈ క్రమంలోనే బెంగాల్‌లో ఓ వ్యాపారి దగ్గరికి కొంత బంగారం అమ్మేందుకు వచ్చిన దొంగను ఓ పోలీస్ టీమ్ పట్టుకున్నట్లు తెలిసింది. అలాగే బిహార్‌కు వెళ్లిన మరో టీమ్‌కు ముఠాలోని ఇంకో దొంగ చిక్కినట్లు సమాచారం. మొత్తంగా ఇద్దరు దొంగలు చిక్కడం, కొంత బంగారం రికవరీ కావడంతో మిగతా ముగ్గురి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
పాన్ ఇండియా లెవల్ నెట్‌వర్క్
పీఎంజే జ్యువెల్లరీలో దోపిడీలో పాల్గొన్న దొంగలు.. గతంలో వేర్వేరు కేసుల్లో జైలుకెళ్లినప్పుడు ఒకరికొకరు పరిచయమైనట్లు పోలీసులు గుర్తించారు. ఇలా వారంతా ఒక ముఠాగా ఏర్పడి బిహార్‌తో పాటు దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో బంగారం షాపులు, బ్యాంకులు, ఏటీఎంలను కొల్లగొట్టడం టార్గెట్‌గా పెట్టుకున్నట్లు సమాచారం. వీరు చాలా దోపిడీ కేసుల్లో నిందితులుగా ఉండి, పరారీలో ఉన్నట్లు తెలిసింది. దోపిడీ దొంగల ముఠా కరీంనగర్ పోలీసులకు చిక్కితే ఇతర రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న పాత కేసులు సైతం బయటికొచ్చే అవకాశముంది.
