కరీంనగర్, వెలుగు: కరీంనగర్– జగిత్యాల నేషనల్ హైవే 563 పనులకు మోక్షం కలగడం లేదు. రహదారి నిర్మాణానికి నిధులు మంజూరై ఏడేళ్లయినా ముందుకు సాగడం లేదు. ఓ వైపు ఇదే హైవేకు సంబంధించి కరీంనగర్– హన్మకొండ ప్యాకేజీ మూడేళ్ల క్రితమే ప్రారంభమై 80 శాతం పనులు పూర్తవ్వగా.. కరీంనగర్ -జగిత్యాల ప్యాకేజీ పనులు మాత్రం భూసేకరణ వద్దే ఆగిపోయాయి.
రెండేళ్లుగా టెండర్ పేరుతోనే కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ప్రస్తుతం ఈ హైవే కేవలం డబుల్ రోడ్డు మాత్రమే కావడంతో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌తో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏటా పదుల సంఖ్యలో చనిపోతుండగా.. వందల్లో క్షతగాత్రులవుతున్నారు.
ప్రమాదాలకు నిలయంగా జాతీయ రహదారి
కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి, చొప్పదండి, గంగాధర క్రాస్ రోడ్డు, కొండగట్టు, ధరూర్, జగిత్యాల, సారంగాపూర్, ధర్మపురి పట్టణాల మీదుగా వెళ్లే ఈ హైవేలో అనేక ప్రమాదకరమైన మూలమలుపులు ఉన్నాయి. రోడ్డు కూడా చాలాచోట్ల ధ్వంసమై ఉంది. రోజూ వేలాది వాహనాల రాకపోకలతో ఈ దారిలో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి.
ఈ జాతీయ రహదారిపై కొత్తపల్లి, రామడుగు, గంగాధర, కొడిమ్యాల, మల్యాల పోలీస్ స్టేషన్ల పరిధిలో నిరుడు జరిగిన యాక్సిడెంట్లలో 40 మందికి మృత్యువాతపడ్డారు. 140 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. కరీంనగర్ నుంచి కొండగట్టు లేదా జగిత్యాలకు వెళ్లాలంటే వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. రాత్రయితే ఆ రోడ్డు మీదుగా పోయే ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్తున్నారు.
రేకుర్తి బ్రిడ్జి, రామాలయం మలుపు, -వెలిచాల క్రాస్ రోడ్డు, కొత్తపల్లి ఎస్సారెస్పీ కాల్వ ప్రాంతం, దేశరాజ్ పల్లి, వెదిరలోని రెండు బ్రిడ్జిల ప్రాంతం, హిమ్మత్‌నగర్ క్రాస్ రోడ్డు, కురిక్యాల బ్రిడ్జి, పూడూరు ఆరెపల్లి మలుపు, నమిలికొండ శివారులోని రైల్వే ట్రాక్, కొండగట్టు-– బల్వంతాపూర్ క్రాస్ రోడ్డు, అభయాంజనేయ ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు.
ఏడేళ్ల క్రితమే నిధులు మంజూరు..
జగిత్యాల–కరీంనగర్ రోడ్డును 563 నేషనల్ హైవేగా గుర్తించిన కేంద్రం రహదారి విస్తరణ కోసం ఆరేళ్ల కింద రూ.1503 కోట్లు మంజూరు చేసింది. 58.86 కిలోమీటర్ల రహదారి విస్తరణకు 307 హెక్టార్ల భూమి సేకరించారు. అయితే పనులు ప్రారంభించడంలో ఆలస్యం కావడం, మెటీరియల్ కాస్ట్ పెరగడంతో నిర్మాణ వ్యయాన్ని కేంద్రం రూ.2,484 కోట్లకు పెంచింది.
గత ఎన్నికల ముందే పనులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఈ రహదారి విస్తరణ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు. 58 కిలోమీటర్ల మేర చేపట్టే విస్తరణ పనుల్లో మూడు ప్రాంతాల్లో బైపాస్ రోడ్లు, ఆరు మేజర్, 18 మైనర్‌బ్రిడ్జిలు, 195 కల్వర్టులను నిర్మించాల్సి ఉంది. ఫోర్ లేన్ నిర్మాణం పూర్తయితే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడంతోపాటు కరీంనగర్– -జగిత్యాల మధ్య దూరం తగ్గనుంది.
పనుల్లో వేగం పెంచాలె..
కరీంనగర్– -జగిత్యాల జాతీయ రహదారి పనులు త్వరగా ప్రారంభించాలని గతంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని పలుమార్లు కోరారు. అలాగే ఇటీవల చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా బండి సంజయ్‌ని కలిసి ఈ రహదారి పనులు ఆలస్యం కావడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. సంబంధిత శాఖ మంత్రి, అధికారులను కలిసి పనులు స్పీడప్ చేయాలని కోరారు.

