కరీం నగర్ జిల్లాలో కుప్పలు తెప్పలుగా నకిలీ రశీదులు

కరీం నగర్ జిల్లాలో  కుప్పలు తెప్పలుగా నకిలీ రశీదులు
  •       లీగల్ మెట్రాలజీలో ఇల్లీగల్ దందా.. 
  •       సీరియల్ నంబర్, కేసు నంబర్ లేని రశీదులు..ఇష్టారాజ్యంగా వసూళ్లు
  •       మాజీ అసిస్టెంట్ కంట్రోలర్ విజయసారథిపై ఎంక్వైరీలో అక్రమాలు వెలుగులోకి..
  •       అవినీతి వ్యవహారంలో జనవరి ఫస్ట్ వీక్‌‌‌‌లో సస్పెన్షన్
  •       దుకాణాదారులకు నకిలీ రశీదులు ఇచ్చి వసూళ్లకు పాల్పడినట్లు గుర్తింపు 

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లా లీగల్ మెట్రాలజీ డిపార్ట్ మెంట్‌‌‌‌లో ఆ శాఖ అసిస్టెంట్ కంట్రోలర్‌‌‌‌‌‌‌‌గా పనిచేసిన విజయసారథి ఇల్లీగల్ దందా నడిపారు. దుకాణాదారులకు ఫైన్లు వేశాక సీరియల్ నంబర్లు లేని రశీదులు ఇవ్వడం, ఆ తర్వాత బ్లాక్‌‌‌‌మెయిల్‌‌‌‌కు దిగడం, వసూళ్లకు పాల్పడిన ఘటనలు ఉన్నతాధికారులు తాజాగా చేపట్టిన ఎంక్వైరీలో వెలుగులోకి వస్తున్నాయి. డిగ్రీ వివరాలను సర్వీస్ బుక్‌‌‌‌లోకి ఎంట్రీ చేసేందుకు విజయసారథి తన కింది ఉద్యోగి అయిన టెక్నికల్ అసిస్టెంట్ నవీన్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ నుంచి రూ.లక్ష డిమాండ్ చేయగా.. జనవరి 6న ఆయనను సస్పెండ్ చేస్తూ సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 

సస్పెన్షన్ అనంతరం ఆయనపై తోటి ఉద్యోగులు, ఇతర వర్గాల నుంచి ఫిర్యాదులు అందడంతో ఇటీవల ఆ శాఖ ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేపట్టగా.. విజయసారథి అక్రమాలు మరిన్ని వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది.  అంతేగాక  సస్పెన్షన్ ఉత్తర్వులు అందజేసేందుకు జనవరిలో కరీంనగర్ ఎల్ఎండీలోని ఆఫీసుకు వచ్చిన ఆ శాఖ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌కు విజయసారథి టేబుల్ పై సుమారు 200 వరకు నకిలీ పంచనామాలు దొరికినట్లు తెలిసింది. అయితే ఆ పంచనామాలను ప్రస్తుత ఎంక్వైరీ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌కు అందజేశారా లేదా అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. 

సీరియల్ నంబర్, కేసు నంబర్ లేని పంచనామాలు.. 

సాధారణంగా మాన్యువల్‌‌‌‌గా ఫైన్లు వేసే ఏ శాఖయినా పారదర్శకత, జవాబుదారీతనం కోసం సీరియల్ నంబర్ కలిగిన ఒరిజనల్ రశీదు పుస్తకాలనే వినియోగిస్తోంది. కానీ కరీంనగర్ జిల్లా తూనికలు, కొలతల శాఖలో విజయసారథి ఇచ్చే పంచనామా రశీదులకు ఎలాంటి సీరియల్ నంబర్ ఉండదు. అందులో కేసు నంబర్ వేయరు. తాను లీగల్ మెట్రాలజీ డిస్ట్రిక్ట్ ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌గా ఉన్నప్పుడు ముద్రించుకున్న రశీదు బుక్‌‌‌‌లనే కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో అసిస్టెంట్ కంట్రోలర్ హోదాలో వినియోగించారు. షాపు యజమానులు కాళ్ల బేరానికి వచ్చి.. డబ్బులు ముట్టజెప్పితే ఆ పంచనామాలను వారి ఎదుటే చించేయడం అలవాటుగా మారింది. 

వీటికి సీరియల్ నంబర్ లేకపోవడం, ఆఫీసులో కౌంటర్ ఫైల్ లేకపోవడంతో ఆయన అవినీతికి ‘లెక్క’ లేకుండా పోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాక పంచనామాలు డిస్ట్రిక్ట్ ఇన్‌‌‌‌స్పెక్టర్  రాయాల్సి ఉండగా.. విజయసారథి కేవలం డ్రైవర్‌‌‌‌‌‌‌‌ను మాత్రమే తీసుకెళ్లి పంచనామాలు రాయడం, వాటిపై పంచ్ విట్‌‌‌‌నెస్‌‌‌‌గా డ్రైవర్‌‌‌‌‌‌‌‌తో సంతకం పెట్టించడం వివాదాస్పదంగా మారింది. 

ప్యాకింగ్ సరిగా లేదని, ధరలు ముద్రించలేదని, కొలతల్లో తేడా ఉందని, స్వీట్స్‌‌‌‌కు ఎక్స్‌‌‌‌పైరీ డేట్ లేదనే పలు కారణాలతో షాపు యజమానులను బెదిరించి రూ. లక్ష వరకు డిమాండ్ చేయడం.. ఆ తర్వాత అందులో సగం ముట్టజెప్పినా ఆ పంచనామాలను వెంటనే చించేయడం ఆయనకు అలవాటని పలువురు వ్యాపారులు గుర్తుచేస్తున్నారు. 

ఆన్‌‌‌‌లైన్ ఓచర్లతో ఆఫీసర్ జేబులోకి ఫీజులు..  

షాపులు, వ్యాపార సముదాయాల్లో వినియోగిస్తున్న తూనికల పరికరాలను(కాంటాలను) లీగల్ మెట్రాలజీ ఆఫీసర్లు ప్రతి ఏటా సరిచూసి ముద్ర వేసి రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది. అనంతరం వారు నిర్ణీత ఫీజు తీసుకుని ఓచర్ ఇవ్వడంతోపాటు ఆ వివరాలను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో నమోదు చేయాలి. అప్పుడే కాంటా యజమానులకు వెరిఫికేషన్ సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది. 

కానీ సదరు ఆఫీసర్ వ్యాపారుల దగ్గర ఫీజులు తీసుకుని చాలా షాపుల వివరాలు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ చేయకపోవడంతో ఆ  డబ్బులు సర్కార్ ఖజానాలో జమకాలేదని తెలిసింది.  కశ్మీర్ గడ్డ మార్కెట్‌‌‌‌లో వ్యాపారులకు ఇచ్చిన ఓచర్ల వ్యవహారంపై 2021 అదే ఆఫీసులో పనిచేసే ఉద్యోగి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎంక్వైరీ చేసినా.. ఇప్పటి వరకు ఎటూ తేల్చలేదు.      

రూ.లక్ష అడిగిన కేసుల్లో.. 10 వేల ఫైన్‌‌‌‌తో క్లోజ్..

కరీంనగర్‌‌‌‌‌‌‌‌ టవర్ సర్కిల్ ఏరియాకు చెందిన రెండు షాపుల్లోకి నిరుడు అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో మాజీ అసిస్టెంట్ కంట్రోలర్ విజయసారథి తన వెహికల్ డ్రైవర్‌‌‌‌‌‌‌‌తో తనిఖీకి వెళ్లాడు. ఒక షాపులో అన్ని బిల్ బుక్స్‌‌‌‌లో ఒకే తీరుగా బిల్ నంబర్లు ఉన్నాయని, మరో షాపులో ప్యాకింగ్ లేదని పంచనామా రాశారు. ఆ తర్వాత ఓనర్‌‌‌‌‌‌‌‌కు ఫోన్ చేసి ఒక్కో షాపునకు రూ.50 వేల చొప్పున చెల్లించి కేసు క్లోజ్ చేసుకోవాలని, లేదంటే కోర్టుకు రాస్తానని బెదిరించారు. 

తాను అంత కట్టలేనని, కోర్టులోనే చూసుకుంటానని సదరు ఓనర్  తెగేసి చెప్పాడు. విజయసారథి సస్పెండయ్యాక సదరు వ్యాపారి లీగల్ మెట్రాలజీ ఆఫీసులో సంప్రదిస్తే  నిబంధనల ప్రకారం ఒక్కో కేసులో రూ.5 వేల ఫైన్ చెల్లిస్తే సరిపోతుందని చెప్పడంతో.. రెండు షాపులకు కలిపి రూ.10  వేలు చెల్లించారు. అంటే ఒక్కో షాపు నుంచి సదరు ఆఫీసర్  వసూళ్లు ఏస్థాయిలో ఉండేవో అర్థం చేసుకోవచ్చు.