- ఏ వాడకెళ్లినా ప్రచార బృందాల జోరు
- ప్రధాన పార్టీల అభ్యర్థులకు దీటుగా ఇండిపెండెంట్ల క్యాంపెయిన్
- రోజుకు ఒకరికి రూ.500, మీటింగ్స్ కు వెళ్తే రూ.200
- కాలనీల వారీగా రాత్రుళ్లు మగవాళ్లకు మద్యం విందులు
కరీంనగర్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గరపడుతోంది. ప్రచార సభలకు, ఇంటింటి ప్రచారానికి ఇంకా రెండు రోజుల గడువే ఉంది. దీంతో కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఏ వాడకెళ్లినా ఏదో ఒక పార్టీ అభ్యర్థికి సంబంధించిన ప్రచార రథాలు, క్యాంపెయిన్ బృందాలే కనిపిస్తున్నాయి.
అభ్యర్థుల పేర్ల మీద ప్రత్యేకంగా రూపొందించిన పాటలు, నినాదాలతో పట్టణాలు హోరెత్తుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులతో సమానంగా సీపీఐ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, జనసేన అభ్యర్థులతోపాటు ఇండిపెండెంట్లు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో భాగంగా ఒక్కో ఇంటికి రోజుకు ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు లేదంటే వారి అనుచరులు వెళ్లి ఓటు అడుగుతున్నారు. అభ్యర్థులు ప్రతి ఓటరును కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు.
రోజుకు ఒకరికి రూ.500, మీటింగ్‌కు వెళ్తే రూ.200
మున్సిపల్ ఎన్నికలతో పట్టణాల్లో చాలా మందికి ఉపాధి దొరుకుతోంది. ప్రచారానికి వెళ్లే మహిళలు, యువతకు రోజుకు రూ.500 కూలీగా ఇస్తున్నారు. మీటింగ్స్‌కు వెళ్తే రూ.200 నుంచి రూ.300 చెల్లిస్తున్నారు. ప్రచార బృందాల్లో అత్యధికంగా మహిళలే కనిపిస్తున్నారు. ఓట్లకు డబ్బులు ఆశించని కాలనీల్లో రాత్రయితే 20, 30 మంది మగవాళ్లకు కలిపి ఒకచోట మద్యం, నాన్ వెజ్‌తో దావత్‌లు ఇస్తున్నారు. కొన్నిచోట్ల ఇళ్లకే చికెన్, మటన్ పంపిస్తున్నట్లు తెలిసింది. తమకు అనుకూలంగా మౌత్ టాక్ ను జనాల్లోకి తీసుకెళ్లేందుకు రోజు కొందరితో అదే పనిగా జనాల్లో చర్చ పెట్టిస్తున్నారు.
కరీంనగర్ మీదే అందరి దృష్టి..
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌పై ప్రధాన పార్టీలన్ని దృష్టిసారించాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్నర్ మీటింగ్‌లతో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. కరీంనగర్ సిటీలో రెండు, మూడు డివిజన్లు ప్రజలను ఒక్క చోట చేర్చి ప్రసంగిస్తున్నారు. హుజూరాబాద్, జమ్మికుంట, వేములవాడ, సిరిసిల్ల పట్టణాలకు ఒక దఫా వెళ్లి ప్రచారం చేసొచ్చారు. అలాగే కరీంనగర్‌లో కాంగ్రెస్ గెలుపు బాధ్యతలను కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు భుజానెత్తుకున్నారు.
ఆయనకు సపోర్ట్‌గా సుడా చైర్మన్
కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి డివిజన్లలో ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఒక దఫా మంత్రి శ్రీధర్ బాబు ప్రచారం చేసి వెళ్లగా.. చివరి రెండు రోజులు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు కూడా ప్రచారం చేస్తారని తెలిసింది.
బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారం సందర్భంగా లీడర్లు ప్రత్యర్థులపై చేస్తున్న విమర్శలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి.
