- బల్దియాకు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించడంలో రెవెన్యూ, టీఎన్జీవోస్ నేతల నిర్లక్ష్యం
- రెవెన్యూ కాంప్లెక్స్ నుంచి రూ. కోటి, టీఎన్జీవో కాంప్లెక్స్ నుంచి రూ.90 లక్షల బకాయిలు
- ఎక్సైజ్, సివిల్ సప్లయ్ తదితర ఆఫీసుల నుంచి రూ.లక్షల్లో ట్యాక్స్ పెండింగ్
- చూసీచూడనట్లు వదిలేస్తున్న బల్దియా ఆఫీసర్లు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సర్కార్ నుంచి కోట్లాది విలువైన స్థలాలు పొంది, బిల్డింగ్స్ నిర్మించి, కిరాయిలకు ఇచ్చి నెలనెలా రూ.లక్షల్లో ఆదాయం పొందుతున్న రెవెన్యూ, టీఎన్జీవోస్ అసోసియేషన్లు బల్దియాకు మాత్రం ప్రాపర్టీ ట్యాక్స్ దశాబ్దాలుగా చెల్లించడం లేదు. కిరాయిదారుల వద్ద నెలనెలా అద్దెను ముక్కు పిండి వసూలు చేస్తున్న అసోసియేషన్ల లీడర్లు.. కార్పొరేషన్‌కు పన్ను కట్టడంలో రెవెన్యూ, టీఎన్జీవో నేతలు నిర్లక్ష్యం చేస్తున్నారు.
రెవెన్యూ కాంప్లెక్స్ నుంచి రూ. కోటి, టీఎన్జీవో కాంప్లెక్స్ నుంచి రూ.90 లక్షలు బకాయి ఉండగా.. సివిల్ సప్లయ్, ఎక్సైజ్ తదితర ప్రభుత్వ శాఖల నుంచి కూడా రూ.లక్షల్లో ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్‌లో ఉంది. సామాన్యుల విషయంలో నోటీసుల మీద నోటీసులు ఇచ్చి ఒత్తిడి చేసే బల్దియా ఆఫీసర్లు.. వీరి విషయంలో మాత్రం చూసీచూనడట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం మార్చిలో ఈ బిల్డింగ్స్‌కు నోటీసులు అంటించి హడావుడి చేసి వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
రెవెన్యూ క్లబ్ బకాయి రూ.కోటిపైనే..
రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనివిధంగా కరీంనగర్ రెవెన్యూ అసోసియేషన్‌కు కలెక్టరేట్ ఎదుట రూ.కోట్ల విలువైన భవనాలు ఉన్నాయి. రెవెన్యూ గార్డెన్స్(ఫంక్షన్ హాల్)తోపాటు రెవెన్యూ క్లబ్, షాపింగ్ కాంప్లెక్స్‌లో నెలనెలా రూ.లక్షల్లో అద్దెలు వసూలవుతున్నాయి. కిరాయిదారుల వద్ద అసోసియేషన్ బాధ్యులు నెలనెలా ముక్కుపిండి కిరాయి వసూలు చేస్తుంటారు. కానీ మున్సిపల్ కార్పొరేషన్ కు చెల్లించాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ మాత్రం 2002 నుంచి చెల్లించడం లేదు.
కరీంనగర్ తహసీల్దార్ ఆఫీసు నుంచి రూ.28.42 లక్షలు, రెవెన్యూ క్లబ్ ప్రెసిడెంట్ పేరిట ఉన్న హౌస్ నుంచి రూ.7.85 లక్షలతోపాటు రెవెన్యూ క్లబ్ పేరిట ఉన్న మరో 35 షట్టర్లు, షాపుల నుంచి రూ.90 లక్షలకుపైగా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు కావాల్సి ఉంది. ట్యాక్స్ చెల్లించకపోయినా 24 ఏళ్లుగా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
35 ఏండ్లుగా ఒక్క పైసా కట్టలే..
కరీంనగర్ జిల్లా లైబ్రరీ ఎదురుగా మెయిన్ రోడ్డుకు ఆనుకుని టీఎన్జీవోస్ యూనియన్‌కు రెండు జీ ప్లస్ 3 కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి. వీటితోపాటు ఫంక్షన్ హాల్ కూడా ఉంది. ఈ భవనంలో ఓ చిట్ ఫండ్ ఆఫీస్‌తోపాటు వివిధ వ్యాపారాలు నిర్వహించే షాపులు ఉన్నాయి. వీటి ద్వారా టీఎన్జీవోస్ కరీంనగర్ జిల్లా యూనియన్‌కు నెలనెలా రూ.లక్షల్లో కిరాయిలు జమ అవుతాయి.
కానీ బల్దియాకు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించడం లేదు. సెక్రటరీ టీఎన్జీఓస్ బిల్డింగ్ కాంప్లెక్స్ పేరిట ఉన్న హౌస్ ప్రాపర్టీ ట్యాక్స్ 1991 నుంచి పైసా చెల్లించకపోవడం గమనార్హం. 35 ఏళ్లలో ఈ బిల్డింగ్ పేరిట ట్యాక్స్ రూ.61,67,868 పేరుకుపోయింది. సెక్రటరీ టీఎన్జీవోస్ ఫంక్షన్ ప్యాలెస్ పేరిట మరో బిల్డింగ్ ట్యాక్స్ రూ.29,25,171 పెండింగ్ లో ఉంది. మొత్తం బకాయిలు రూ.90 లక్షలు దాటాయి. ఈ బిల్డింగ్స్ కు తాజాగా మరోసారి బల్దియా రెవెన్యూ సిబ్బంది డిమాండ్ నోటీసులు అంటించారు.
ప్రభుత్వ ఆఫీసులది అదే పరిస్థితి..
కరీంనగర్ కలెక్టరేట్‌లో దాదాపు అన్ని విభాగాలు బల్దియాకు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. ఇందులో చాలా శాఖలు రూ.లక్షల్లో ట్యాక్స్ బకాయి ఉన్నాయి. ఇందులో అత్యధికంగా డీఈవో ఆఫీసు పేరిట రూ.21.83 లక్షలు, జిల్లా సివిల్స్ సప్లై ఆఫీసు పేరిట రూ.15.85 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్ లో ఉంది. అలాగే జిల్లా హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రూ.10.73 లక్షలు, జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ రూ.4.22 లక్షలు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీసు నుంచి రూ.7.10 లక్షలు చెల్లించాల్సి ఉంది.
కలెక్టర్ నివాసానికి సంబంధించి 2022 నుంచి ఇప్పటివరకు రూ.1,70,320 ట్యాక్స్ పెండింగ్‌లో ఉంది. కలెక్టరేట్ కాంప్లెక్స్‌లోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి 1997 నుంచి 2025 వరకు రూ.21.27 లక్షలు పెండింగ్‌లో ఉండగా.. అంతా కలిపి నిరుడు మార్చి 31న క్లియర్ చేశారు. ఎస్ బీఐ తప్పా దాదాపు మిగతా శాఖలన్ని ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్‌లోనే ఉన్నాయి.
