సీఎంఆర్ అప్పగింతలో మిల్లర్ల నిర్లక్ష్యం.. 2022–23 వానకాలం సీజన్ సీఎంఆర్ 88 వేల మెట్రిక్ టన్నులు పెండింగ్

సీఎంఆర్ అప్పగింతలో మిల్లర్ల నిర్లక్ష్యం.. 2022–23 వానకాలం సీజన్ సీఎంఆర్ 88 వేల మెట్రిక్ టన్నులు పెండింగ్
  • 2023–-24లో 20 మిల్లుల నుంచి 22,996 మెట్రిక్ టన్నుల బకాయి
  • మరాడించి బియ్యాన్ని ప్రైవేట్ మార్కెట్‌‌కు తరలించిన మిల్లర్లు ? 
  • మూడేళ్లయినా బియ్యం ఎఫ్‌‌సీఐకి అప్పగించడంలో జాప్యం

కరీంనగర్, వెలుగు:  జిల్లాలో కస్టమ్ మిల్​డ్ రైస్(సీఎంఆర్) ఎఫ్‌‌సీఐకి అప్పగించడంలో రైస్ మిల్లర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రతి సీజన్‌‌లో సర్కార్ నుంచి రూ.కోట్ల విలువ చేసే వడ్లు తీసుకుంటున్న మిల్లర్లు.. వాటిని మరాడించి బియ్యంగా చేసి ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు.

కొందరు మిల్లర్లు మూడు, నాలుగేళ్ల క్రితం నాటి సీఎంఆర్ పెండింగ్ లో ఉన్నారంటే సివిల్ సప్లై, విజిలెన్స్ అండ్ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ ఆఫీసర్ల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరీంనగర్ జిల్లాలో 2022–23 వానకాలం సీజన్‌‌కు సంబంధించి 88 వేల మెట్రిక్ టన్నులు పెండింగ్‌‌లో ఉంటే.. 2023–24లో 20 మిల్లుల నుంచి 22,996 మెట్రిక్ టన్నుల బియ్యం బకాయి ఉంది. 

బియ్యం బయట అమ్ముకుని..

సీఎంఆర్ నిబంధనల ప్రకారం క్వింటాకు 67 కేజీల బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది.  ప్రభుత్వం ధాన్యం అప్పగించాక మూడు నెలల్లోపు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ గడువులోగా మెజార్టీ మిల్లర్లు బియ్యం అప్పగించడం లేదు. దీంతో ఆఫీసర్లు గడువు మీద గడువు పెంచుతూ పోతున్నారు. కొందరు సివిల్‌‌ సప్లయ్‌‌ అధికారుల అండదండలతోనే రూ.కోట్లాది విలువైన వడ్లను మిల్లర్లు ఇతర రాష్ట్రాల్లో అమ్ముకుని ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని ఎగ్గొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వం ఒత్తిడి చేస్తే.. తర్వాతి సీజన్‌‌ వడ్లను మరాడించి అంతకుముందు సీజన్ సీఎంఆర్ కింద సర్దుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కొందరైతే దళారుల ద్వారా పీడీఎస్‌‌ బియ్యాన్ని  కొనుగోలు చేసి, వాటినే రీసైక్లింగ్‌‌ చేసి తిరిగి ప్రభుత్వానికి ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తరచూ మిల్లుల్లో ఆకస్మిక దాడులు నిర్వహించి.. ఆ మిల్లుకు కేటాయించిన ధాన్యమెంత.. ? మిల్లింగ్ అయిన బియ్యం ఎంత.. ? సర్కార్ కు అప్పగించింది ఎంత ? ధాన్యం ఏమైనా పక్కదారి పట్టిందా.. ? అనే వివరాలు సేకరించాల్సి ఉండగా.. మొక్కుబడి దాడులు నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.  

బీఆర్ఎస్ సర్కార్ నాటి బకాయిలే ఎక్కువ.. 

జిల్లాలో ఉన్న పెండింగ్ సీఎంఆర్ అత్యధికంగా బీఆర్ఎస్ సర్కార్ హయాం నాటిదే. 2022 –23 యాసంగి సీజన్ కు సంబంధించి శ్రీరాములపల్లిలోని శ్రీ సీతారామ ఆగ్రో ఇండస్ట్రీస్‌‌కు సంబంధించి అత్యధికంగా 16,864 మెట్రిక్ టన్నులు, కోరపల్లి మహాశక్తి ఆగ్రోఇండస్ట్రీస్ 12,377  మెట్రిక్ టన్నులు, మానకొండూరు శ్రీవీరభద్ర ఇండస్ట్రీస్ 689 ‌‌‌‌మెట్రిక్ టన్నులు, రేణికుంట ఆర్కే ఇండస్ట్రీస్ 5,629 మెట్రిక్ టన్నులు, జమ్మికుంట సప్తగిరి ఇండస్ట్రీస్ 3,416 మెట్రిక్ టన్నులు, జమ్మికుంట శ్రీ శ్రీదేవి ఇండస్ట్రీస్ 2,819 మెట్రిక్ టన్నులు, గోపాలపూర్ శ్రీలక్ష్మి వెంకటేశ్వర ట్రేడర్స్ 2,769 మెట్రిక్ టన్నులు పెండింగ్‌‌లో ఉన్నాయి.

మానకొండూరు శ్రీనిధి ట్రేడర్స్, పెద్దపాపయ్యపల్లి రవిచంద్ర ఇండస్ట్రీస్, బోర్నపల్లి వరుణ్ ఇండస్ట్రీస్, సాయి ట్రేడర్స్, చొప్పదండి శ్రీశ్వేత ఆగ్రో ఇండస్ట్రీస్ ఒక్కో మిల్లు 2 వేల మెట్రిక్ టన్నులకుపైగా పెండింగ్ లో ఉన్నాయి. ఈ సీజన్ లో మొత్తం 88 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల నుంచి సర్కార్ కు రావాల్సి ఉంది.

n  2023– 24 వానకాలానికి సంబంధించి కోరపల్లి మహాశక్తి ఆగ్రో ఇండస్ట్రీస్ 5,013  మెట్రిక్ టన్నులు, శ్రీరాములపల్లిలోని శ్రీసీతారామ అగ్రో ఇండస్ట్రీస్  అత్యధికంగా 3,522 మెట్రిక్ టన్నులు, ఇప్పలనర్సింగాపూర్ లక్ష్మీగణపతి ఇండస్ట్రీస్ 1,506 మెట్రిక్ టన్నులు, కనగర్తి సాయి ప్రేమ్ రైస్ మిల్లు 1,311 మెట్రిక్ టన్నులు, దుర్శేడు శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లు 1,266 మెట్రిక్ టన్నులు, పెద్దపాపయ్యపల్లి వంశీ ఇండస్ట్రీస్ 1,048 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ పెండింగ్ లో ఉంది. ఈ సీజన్ లో మొత్తంగా 22 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సర్కార్​కు అప్పగించాల్సి ఉంది. 

బ్యాంకు గ్యారంటీతో మొండి మిల్లర్ల కట్టడి.. 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిల్లర్ల దందాపై ఉక్కుపాదం మోపింది. అప్పటివరకు డిఫాల్టర్లుగా తేలిన మిల్లర్లకు, సీఎంఆర్ పెండింగ్ ఎక్కువగా ఉన్న మిల్లర్లకు ధాన్యం కేటాయించకుండా కట్టడి చేసింది. అంతేగాక సీఎంఆర్ ప్రక్రియలో పారదర్శకత కోసం ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీని తప్పనిసరి చేసింది. ఎలాంటి బకాయిల్లేని మిల్లర్లు తమకు కేటాయించే ధాన్యం విలువలో 10 శాతం, సీఎంఆర్ పెండింగ్ ఉన్నవారితోపాటు లీజుపై మిల్లును నడిపేవారు 25 శాతం బ్యాంకు గ్యారంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ సమర్పించాలని సివిల్ సప్లై శాఖ కండీషన్స్ పెట్టింది.

దీంతో గతంతో పోలిస్తే 2024–25 వానకాలంలో 1,75,511 మెట్రిక్ టన్నులకుగానూ 1,71,141 మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్లు డెలీవరీ చేశారు.  ఈ సీజన్‌‌కు సంబంధించి కేవలం 4,369 మెట్రిక్ టన్నులు మాత్రమే సీఎంఆర్ పెండింగ్ ఉండగా,  ఇందులోనూ 12 రైస్ మిల్లుల నుంచి 4,197.5 మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంది.