భగత్‌‌‌‌నగర్ దోపిడీ.. ఇంటి పెద్దల్లుడే దొంగ.. కరీంనగర్ దోపిడి కేసును చేధించిన పోలీసులు

భగత్‌‌‌‌నగర్ దోపిడీ.. ఇంటి పెద్దల్లుడే దొంగ.. కరీంనగర్ దోపిడి  కేసును చేధించిన పోలీసులు
  • కొడుకుతో కలిసి దొంగతనానికి వ్యూహరచన
  • ముగ్గురిని అరెస్ట్​ చేసిన పోలీసులు
  • 43.67 గ్రాముల బంగారం, 64.98 గ్రాముల వెండి స్వాధీనం

కరీంనగర్, వెలుగు: కరీంనగర్‌‌‌‌లోని భగత్‌‌‌‌నగర్‌‌‌‌లో ఇటీవల జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఉత్తరప్రదేశ్‌‌‌‌లోని మీరట్‌‌‌‌కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.2.09 లక్షలు, 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు, 64.98 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 

కేసు వివరాలను కరీంనగర్ సీపీ గౌష్ ఆలం బుధవారం వెల్లడించారు. ఈ నెల 21న అర్ధరాత్రి భగత్‌‌‌‌నగర్‌‌‌‌కు చెందిన అజ్మత్ అలీ ఇంట్లోకి చొరబడిన దుండగులు.. ఆయనతో పాటు భార్య, ఇద్దరు కుమార్తెలను డమ్మీ పిస్టళ్లు, కత్తులతో బెదిరించి తాళ్లతో కట్టేసి, 54 తులాల బంగారం, రూ.25 లక్షల నగదు, 30 తులాల వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.

 దోపిడీ అనంతరం నిందితులు ఉపయోగించిన దొంగిలించిన బైక్‌‌‌‌లను హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి సమీపంలో వదిలివెళ్లినట్లు గుర్తించారు. విచారణలో నిందితులు మీరట్‌‌‌‌కు చెందినవారని నిర్ధారించుకుని అక్కడి పోలీసుల సహకారంతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సల్మాన్ అలియాస్ భూరే అలియాస్ యాదవ్, సల్మాన్ అలియాస్ విమాన్, మొహమ్మద్ హసీన్‌‌‌‌లను అదుపులోకి తీసుకున్నారు.

అల్లుడు, మనుమడి స్కెచ్​..

నిందితులను విచారించగా అజ్మత్ అలీ అల్లుడు రజావుద్దీన్, మనుమడు అజీమ్ రజా ఈ దోపిడీకి ప్రధాన సూత్రధారులుగా తేలినట్లు సీపీ తెలిపారు. రజావుద్దీన్‌‌‌‌పై గతంలో హత్య, ఆయుధాల కేసులతో పాటు ఇతర క్రిమినల్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. రజావుద్దీన్ భార్యతో కుటుంబ కలహాలు తలెత్తడంతో ఆమె గత ఏడాది పుట్టింటికి వచ్చింది. భార్యను తీసుకెళ్లేందుకు వచ్చిన రజావుద్దీన్ అక్కడే కొంతకాలం ఉండగా, అజ్మత్ అలీ కుటుంబ సభ్యులు అతడికి చికిత్స చేయించడంతో పాటు బట్టల వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక సాయం కూడా చేశారు. 

అయితే వ్యాపారంలో నష్టపోయిన అతడు తరచూ డబ్బులు డిమాండ్ చేస్తుండేవాడు. ఇటీవల రూ.5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయగా నిరాకరించడంతో మీరట్‌‌‌‌కు వెళ్లిపోయాడు. మామ ఇంట్లో ఉన్న సమయంలో నగదు, బంగారు ఆభరణాల వివరాలను తెలుసుకున్న రజావుద్దీన్.. తన కుమారుడు అజీమ్ రజా, మరో ముగ్గురితో కలిసి దోపిడీకి పథకం రచించాడు. ఈ నెల 20న మీరట్ నుంచి రామగుండం చేరుకుని, 21వ తేదీ అర్ధరాత్రి డమ్మీ పిస్టళ్లు, కత్తులతో ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులను బెదిరించి దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. 

అరెస్టయిన ముగ్గురు నిందితులను మీరట్ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌‌‌‌పై కరీంనగర్‌‌‌‌కు తీసుకొస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు రజావుద్దీన్, అజీమ్ రజాతో పాటు ఇతర నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నట్లు సీపీ వెల్లడించారు.