కరీంనగర్/కరీంనగర్ టౌన్/ వరంగల్ సిటీ, వెలుగు: నాణ్యమైన ఫుడ్ కోసం.. కాలేజీల్లో సౌకర్యాల కోసం స్టూడెంట్లు రోడ్డెక్కారు. కరీంనగర్ ఫార్మసీ కాలేజీలో వంట మనిషి లేక15 రోజులుగా భోజనమే వండడం లేదు. స్పోర్ట్స్స్కూలులో ఎండిపోయిన బ్రెడ్డు.. చెడిపోయిన జామ్ అందించారు. అధికారులకు తమ సమస్యలు చెప్పుకున్నా పట్టించుకోకపోవడంతో విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. అధికారులు దిగొచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. అలాగే తమ సమస్యలు పరిష్కారించాలంటూ వరంగల్ ఆయుర్వేదిక్ కాలేజీ విద్యార్థులు మూడు రోజలుగా ఆందోళన చేస్తున్నారు.
ఖాళీ ప్లేట్లతో నిరసన
కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీ స్టూడెంట్లు సోమవారం ఉదయం ఖాళీ పేట్లు పట్టుకుని రోడ్డెక్కారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ వండకపోవడంతో వారంతా ఆకలితో ప్లేట్లు పట్టుకుని క్యాంపస్ లో దాదాపు రెండు కిలోమీటర్ల వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. వంటమనిషి లేక 15 రోజుల నుంచి విద్యార్థులు భోజనానికి ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీ ప్రిన్సిపల్ కు చెప్పినా పట్టించుకోలేదు. సోమవారం ఉదయం టిఫిన్ కూడా వండకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మెయిన్ క్యాంపస్ లో వీసీ,చీఫ్ వార్డెన్ ను కలిసేందుకు బయలుదేరగా వారిని అడ్డుకునేందుకు కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది ప్రయత్నించారు. చీఫ్ వార్డెన్ మనోహర్ స్వయంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థుల దగ్గరకు వచ్చి మాట్లాడారు. వెంటనే కుక్ ను అపాయింట్ చేసి, ఫుడ్ ప్రాబ్లమ్ తీర్చాలని, నాణ్యమైన భోజనాన్ని అందించాలని స్టూడెంట్స్డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో విద్యార్థులు తిరిగి కాలేజీకి వెళ్లి పోయారు.
నీళ్ల చికెన్.. ఉడకని గుడ్లు..
కరీంనగర్ రీజినల్ స్పోర్ట్ప్ స్కూల్ లో ఫుడ్ బాగోలేదంటూ స్టూడెంట్లు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఆదివారం చికెన్ కర్రీ నీళ్ల చారులా ఉందని అసలు అన్నమే తినలేదు. సోమవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఎండిపోయిన బ్రెడ్, కెమికల్ వాసన వచ్చే జామ్ ఇచ్చి.. ఎగ్, పాలు ఇవ్వకపోవడంతో మరోసారి ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల దగ్గకు వచ్చిన జిల్లా యువజన, క్రీడా అధికారి రాజ్వీర్తో వారు వాగ్వాదానికి దిగారు. కలెక్టర్ వచ్చే వరకు కదిలేది లేదంటూ 4 గంటల పాటు స్కూలు గేట్ ముందు బైఠాయించారు. విషయం తెలిసి కలెక్టర్ అక్కడికి అర్బన్ తహసీల్దార్ సుధాకర్‌ను పంపారు. స్టూడెంట్లతో మాట్లాడిన తహసీల్దార్ వారం రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అయితే హైదరాబాద్‌కు చెందిన స్నేహ క్యాటరర్స్ కాంట్రాక్ట్ దక్కించుకోగా.. వారినుంచి లోకల్ లీడర్లు తీసుకున్నారని, బయట వండించిన ఫుడ్ సప్లై చేయడం వల్ల క్వాలిటీ ఉండడం లేదని విద్యార్థులు ఆరోపించారు.
సౌలతుల కోసం ధర్నా
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్‌లోని అనంతలక్ష్మి ఆయుర్వేద కాలేజీ విద్యార్థులు మూడు రోజలుగా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వ ఆయుర్వేదిక్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న కాలేజీలో మౌలిక వసతులు కల్పించాలని, సీట్లను భర్తీ చేయాలంటూ సోమవారం వెంకట్రామా జంక్షన్ నుంచి ఎంజీఎం చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. అక్కడే రోడ్డుపై బైఠాయించి కాలేజీలో 67 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండాలని, కేవలం 23 మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. కాలేజీని ఇన్ చార్జి ప్రిన్సిపాల్ నడిపిస్తున్నారని, అవసరమైన బుక్స్ లేవని ఆరోపించారు. విద్యార్థులకు బాత్రూమ్లు కూడా సరిగా లేవన్నారు. పూర్తిస్థాయి ఫ్యాకల్టీ, వసతులుంటేనే అడ్మిషన్స్‌కు పర్మిషన్ ఇస్తామని కేంద్ర ఆయూష్ శాఖ తేల్చి చెప్పిందని, వెంటనే వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
