
కర్ణాటకలో సైబర్ నేరాల ఆందోళనకరంగా మారుతున్నాయి. ఒకప్పుడు సాధారణ ప్రజలను టార్గెట్ చేసుకునే స్కామర్లు ఇప్పుడు రాజకీయ నాయకుల కుటుంబాలను కూడా వెంటాడుతున్నారు. కొన్ని రోజుల క్రితం చిక్కబళ్లాపూర్ బీజేపీ ఎంపీ, కర్ణాటక మాజీ మంత్రి కె సుధాకర్ భార్య డాక్టర్ ప్రీతి సుధాకర్ డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ మోసానికి గురైంది. కానీ ఆమె పోగొట్టుకున్న రూ.14 లక్షలను బెంగళూరు పోలీసులు రికవరీ చేసారు.
పోలీసుల ప్రకారం ఆగస్టు 26న 44 ఏళ్ల ప్రీతికి ముంబై సైబర్ క్రైమ్ అధికారులమని చెప్పుకుంటూ ఓ వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. ఆమె బ్యాంక్ అకౌంట్ అక్రమ అంతర్జాతీయ లావాదేవీలతో లింకై ఉందని, డబ్బును వెరిఫికేషన్ ఆకౌంటుకు బదిలీ చేయకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం 45 నిమిషాల్లో మీ డబ్బు మీకు తిరిగి చెల్లిస్తామని ఆమెకు హామీ ఇచ్చారు. అరెస్టుకు భయపడిన ఆమె తన HDFC బ్యాంక్ అకౌంట్ నుండి తెలియని ఓ యెస్ బ్యాంక్ అకౌంటుకు రూ. 14 లక్షలు పంపింది.
తరువాత కాసేపటికి తాను మోసపోయానని గ్రహించి అదే రోజు సాయంత్రం వెస్ట్ డివిజన్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించింది. పోలీసులు వెంటనే చర్య తీసుకొని, దర్యాప్తు అధికారులు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ హెల్ప్‌లైన్ 1930లో కేసు నమోదు చేసి వెంటనే రిసీవర్ బ్యాంక్ అకౌంట్ ఫ్రిజ్ చేసారు. ఇలా డిజిటల్ అరెస్ట్ పేరుతో చేసే మోసాలను వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి కాల్ చేసి తెలియజేయాలని పోలీసులు కోరారు. దీనినే గోల్డెన్ అవర్ అని అంటారని తెలిపారు.
చివరికి సెప్టెంబర్ 3న ACJM కోర్టు యెస్ బ్యాంక్ ఫ్రిజ్ చేసిన డబ్బును ప్రీతికి తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. దింతో మొత్తం డబ్బును వారంలోపు ఆమె అకౌంట్లో తిరిగి జమ అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్) గిరీష్ ఎస్ & అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్ సిఇఎన్) ఉమారాణి మాట్లాడుతూ బెంగళూరు పోలీసులు ఇలాంటి పరిస్థితుల్లో త్వరగా చర్య తీసుకోవాలని, ఎన్‌సిఆర్‌పి హెల్ప్‌లైన్ 1930కి కాల్ చేసి, ఆలస్యం చేయకుండా ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. ఇలా చేయడం వల్ల పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు.