- డిసెంబర్ ఫస్ట్‌లోగా తేలే చాన్స్
బెంగళూరు: సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య నాయకత్వ పోరు అంశం ఢిల్లీకి షిఫ్ట్ అయింది. కొద్దిరోజులుగా జరుగుతున్న లాబీయింగ్‌కు త్వరలోనే తెరపడనున్నట్లు తెలుస్తోంది. రెండున్నరేండ్ల పాలన తర్వాత కర్నాటకలో సీఎం పదవి మార్పు అనే మ్యాటర్ రాష్ట్రంలో హీట్‌ను పెంచింది.
ఇచ్చిన మాట ప్రకారం సీఎం పదవి తనకు ఇవ్వాలని డీకే శివకుమార్, లేదు తానే పూర్తి ఐదేండ్లు కొనసాగుతానని సిద్ధరామయ్య అనడం రాష్ట్ర రాజకీయాల్లో కన్‌ఫ్యూజన్‌ను క్రియేట్ చేసింది. 2.5+2.5 ఫార్ములా అమలు చేయాలని డీకే వర్గం నెల రోజులుగా ఒత్తిడి తెస్తోంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి ఆయన పేరును ప్రతిపాదించారు.
ఈ క్రమంలోనే సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు, రాష్ట్ర హోం మంత్రి జి పరమేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సీఎం పదవి గురించి ఎవరైనా అడిగితే నేను రేసులో ఉన్నా అని చెప్తుంటా. కానీ, హైకమాండ్ నిర్ణయించి డీకేను సీఎం కుర్చీలో కూర్చోబెట్టినా స్వాగతిస్తా’’ అని అన్నారు. ఇందుకు కౌంటర్‌గా 2028 వరకు సీఎం పదవి ఖాళీ కాదని మరో మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ చెప్పడంతో ఇరు వర్గాల మధ్య కోల్డ్‌వార్ పీక్‌కు చేరుకుంది.
కన్ఫ్యూజన్‌కు చెక్ పెడ్తం: ఖర్గే
ఈ అంశానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని డిసైడ్ అయినట్లు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే గురువారం మీడియాతో చెప్పారు. పార్టీ సీనియర్ నేతలతో చర్చిస్తామన్నారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తోపాటు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో కలిసి ఢిల్లీలో చర్చిస్తామని చెప్పారు. ‘‘నేను అందరినీ పిలిచి మాట్లాడ్త. సోనియా, రాహుల్ కూడా ఉంటారు. ఈ కన్ఫ్యూజన్‌కు పూర్తిగా చెక్ పెడతాం’’ అని ఖర్గే చెప్పారు. కాగా, ఈ భేటీ వచ్చే శనివారం జరుగుతుందని, డిసెంబర్ ఫస్ట్‌లోగా నిర్ణయం తేలిపోతుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
