కర్ణాటకలో బీజేపీకే జై కొట్టిన లింగాయత్​లు

కర్ణాటకలో బీజేపీకే జై కొట్టిన లింగాయత్​లు
  •     అనుకూలంగా 67శాతం ఓట్లు  ఓట్లు చీల్చిన వొక్కలిగలు
  •     కాంగ్రెస్​కు 34శాతం,  జేడీ(ఎస్)కు 36 శాతం సపోర్ట్
  •     ముస్లింలు  ఏకపక్షంగా  కాంగ్రెస్​కు మద్దతు
  •     బీజేపీకి 46% మంది  ధనవంతుల మద్దతు
  •     50% మంది పేదోళ్లు కాంగ్రెస్​ వైపు
  •     ఎన్డీటీవీ లోక్​నీతి - సీఎస్​డీఎస్​ ఓటర్ సర్వేలో వెల్లడి

బెంగళూరు: కర్నాటక ఎన్నికల ఫలితాల్లో వొక్కలిగ, లింగాయత్ కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన ఎంతోమంది లీడర్లు కర్నాటక రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. ఈ రెండు వర్గాలు కర్నాటకలో ఏ పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయనే దానిపై ఎన్డీటీవీ సర్వే చేసింది. లోక్​నీతి సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్(సీఎస్​డీఎస్)తో కలిసి ఓటర్ల అభిప్రాయాలు సేకరించింది. 21 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 2,143 మంది ఓటర్లను సర్వేలో భాగస్వామ్యం చేసింది. వొక్కలిగలు ప్రధానంగా కాంగ్రెస్, హెచ్​డీ కుమార స్వామికి చెందిన జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్)కు మద్దతు ఇచ్చారు. వీరిలో 34% మంది కాంగ్రెస్​ను సపోర్ట్ చేయగా, 36% మంది జేడీ(ఎస్)కు అనుకూలంగా ఉన్నామని చెప్పారు. 30% మంది ఇతర పార్టీలకు అనుకూలంగా ఉన్నారు. 

58 నియోజకవర్గాల్లో బలంగా వొక్కలిగలు

లింగాయత్​లలో 67% మంది బీజేపీకి అనుకూలంగా ఓటేశారు. 33% మంది ఇతర పార్టీలకు జై కొట్టారు. ఇక ముస్లింలలో 59% మంది కాంగ్రెస్​కు ఓటేయగా.. 41% మంది ఇతర పార్టీలకు అనుకూలంగా నిలిచారు. ఇక, వొక్కలిగలు మొత్తం 58 నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నారు. ఇక్కడ పోటీ చేసిన బీజేపీకి కేవలం 15 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ అంతిమంగా వొక్కలిగలు ఓట్లు చీల్చుతుంటే.. లింగాయత్​లు వన్​సైడ్​గా బీజేపీ వైపు, ముస్లింలు గంప గుత్తగా కాంగ్రెస్​కు ఓటేసేందుకు నిర్ణయించాయి.

పేదోళ్లు ఇష్టపడేది కాంగ్రెస్​నే..

ధనవంతులు బీజేపీకి మద్దతు ఇవ్వగా, పేదోళ్లు కాంగ్రెస్​వైపు నిలబడుతున్నారు. పేదోళ్లలో 50% మంది కాంగ్రెస్​ వైపు, 23% మంది బీజేపీ వైపు, మిగిలిన 27% మంది ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక ధనవంతుల్లో కాంగ్రెస్​ వైపు 31% మంది, బీజేపీ వైపు 46% మంది నిల్చున్నారు. మిగిలిన 23% మంది ఓటర్లు ఇతర పార్టీలకు జై కొట్టారు.

వొక్కలిగలను బీజేపీ ఆకట్టుకునే ప్రయత్నం

లింగాయత్​ ఓటర్లందరూ బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. అయితే, కాంగ్రెస్​కు అనుకూలంగా ఉన్న వొక్కలిగలను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ హైకమాండ్ లింగాయత్​ లీడర్లను బరిలోకి దించింది. రాజకీయ, ఆర్థిక, సామాజికపరమైన భరోసా ఇస్తామంటూ వొక్కలిగల ఓట్లు పొందేందుకు బీజేపీ పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నది. వొక్కలిగలను ప్రసన్నం చేసేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని కూడా బీజేపీ హైకమాండ్ వదులుకోవడం లేదు. మార్చిలో బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్​ను రద్దు చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించి వొక్కలిగలు, లింగాయత్​లకు చెరో 2% రిజర్వేషన్​ కేటాయించింది. బీజేపీ రద్దు చేసిన 4% రిజర్వేషన్​ను మళ్లీ పునరుద్ధరిస్తామంటూ కాంగ్రెస్ లీడర్లు ప్రచారం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్​ వొక్కలిగలు, లింగాయత్​లకు అన్యాయం చేస్తుందని బీజేపీ విమర్శిస్తున్నది. ఇప్పటికే ముస్లింలు కాంగ్రెస్​కు అనుకూలంగా ఉండటంతో.. వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహిస్తున్నది.

లింగాయత్​లు 17%, వొక్కలిగలు 15%

రాష్ట్రంలో లింగాయత్​లు 17% ఉంటే.. వొక్కలిగలు 15% మంది ఉన్నారు. అయినా, రాజకీయంగా వొక్కలిగలు కీలకంగా ఉన్నారు. వొక్కలిగ కమ్యూనిటీ నుంచి కర్నాటక సీఎం పదవిని నలుగురు, ప్రధాని పదవిని ఒకరు అధిష్టించారు. బెంగళూరు రూరల్​లోని నాలుగు నియోజకవర్గాలతో పాటు పాత మైసూర్​లోని 61 సెగ్మెంట్స్​లో వొక్కలిగలు బలంగా ఉన్నారు. బీజేపీ 17 స్థానాల్లో, జేడీఎస్ 26 స్థానాల్లో, కాంగ్రెస్ 18 స్థానాల్లో పవర్​లో ఉంది.  బెంగళూరు వ్యవస్థాపకుడు, 16వ శతాబ్దపు విజయనగర రాజవంశ అధిపతి అయిన నాద ప్రభు కెంపేగౌడ 108 అడుగుల స్టాచ్యూని బెంగళూరు ఎయిర్​పోర్టుకు దగ్గర్లో బీజేపీ ఏర్పాటు చేసింది. 17వ శతాబ్దపు మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్​ను ఇద్దరు వొక్కలిగ నాయకులే హత్య చేశారనే అభిప్రాయానికి కూడా బీజేపీ మద్దతు ఇచ్చింది. ఇది ఎన్నికల ముందు రాజకీయ దుమారాన్ని రేకెత్తించింది.

90 నుంచి 100 సెగ్మెంట్స్​లో లింగాయత్​ల హవా

కర్నాటకలో లింగాయత్​లకు అత్యధికంగా 7% రిజర్వేషన్ ఉంది. వొక్కలిగల కంటే ఒక శాతం ఎక్కువే. రాష్ట్ర జనాభాలో లింగాయత్​ల జనాభా 17శాతం.. అతిపెద్ద సామాజికవర్గంగా నిలిచింది. రాష్ట్రానికి తొమ్మిది మంది సీఎంలను అందించింది. కర్నాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 90 నుంచి 100 సెగ్మెంట్స్ రిజల్ట్స్​ను లింగాయత్​లే నిర్ణయిస్తారు.  1980 కాలంలో మాజీ ప్రధాని రాజీవ్​గాంధీ, కర్నాటక ముఖ్యమంత్రిగా ఉన్న లింగాయత్ నేత వీరేంద్ర పాటిల్​ను పదవి నుంచి తొలగించారు. దీంతో లింగాయత్ సామాజిక వర్గం కాంగ్రెస్​కు వ్యతిరేకమైంది. అదే టైంలో బీజేపీ లింగాయత్​లను తమవైపు తిప్పుకునేందుకు ఆ కమ్యూనిటీలో సీనియర్​ లీడర్లలో ఒకరైన బీఎస్ యడ్యూరప్పను తెరపైకి తీసుకొచ్చింది. ఇలా దక్షిణాది రాష్ట్రంలో బీజేపీ ఎంటర్ అయ్యింది.