ఆదిలాబాద్ బల్దియా బడ్జెట్ రూ.157.97 కోట్లు

ఆదిలాబాద్ బల్దియా బడ్జెట్ రూ.157.97 కోట్లు
  • ఆమోదించిన మున్సిపల్ కౌన్సిల్ 

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ మున్సిపల్ వార్షిక బడ్జెట్ ను మంగళవారం ప్రవేశపెట్టారు. కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన జరిగిన కౌన్సిల్​సమావేశంలో మున్సిపల్ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ బడ్జెట్ ను ఆమోదించారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాలపై సుదీర్ఘంగా చర్చించి, మొత్తం రూ.157.97 కోట్ల అంచనాతో కౌన్సిల్ ఆమోదంతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పురోభివృద్ధిలో బడ్జెట్ అత్యంత కీలకమన్నారు.  పారిశుధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా కార్మికుల జీతాలు, వాహనాల నిర్వహణ కోసం నిధులు కేటాయించామన్నారు.

గ్రీన్ బడ్జెట్ కింద పది శాతం నిధులను పచ్చదనం పెంచడానికి కేటాయించినట్లు చెప్పారు. చైర్ పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ.. వార్డుల వారీగా వెనుకబడిన ప్రాంతాలు, విలీన గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. కొత్తగా విలీనమైన ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, శ్మశాన వాటికల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనున్నామని, మున్సిపాలిటీకి వచ్చే ఆదాయ వనరులైన ఆస్తి పన్ను, నల్లా పన్ను ఖాళీ స్థలాల పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్​కమిషనర్ రాజు, వైస్ చైర్​పర్సన్ రోహిత్, కౌన్సిలర్లు, మున్సిపల్, ఇతర అధికారులు
 పాల్గొన్నారు.