రైతు ఐడియా సూపర్.. పొలం నుంచి కోతులు పరార్

రైతు ఐడియా సూపర్.. పొలం నుంచి కోతులు పరార్

కాస్త తెలివి ఉండాలే గానీ.. సమస్యల పరిష్కారానికి మార్గాలు కోకొల్లలు. ఓ రైతు తాను పండించిన పంటను కోతుల నుంచి కాపాడుకోవడానికి ఓ ఉపాయాన్ని కనిపెట్టి.. మిగతా రైతులు కూడా తన బాటలో నడిచేలా చేశాడు.

కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా నలూరు గ్రామానికి చెందిన శ్రీకాంత్ గౌడ అనే రైతు తన పొలంలో కాఫీ, అరేకా(పోక) పంటలు సాగు చేసేవాడు. తరచూ తన పంటను కోతుల మంద పాడు చేయడంతో.. వాటిని తరిమేయడానికి తన స్నేహితుడి సలహా మేరకు పొలంలో అక్కడక్కడా పులి బొమ్మలను ఏర్పాటు చేశాడు. పోక చెట్లపై ఎక్కేందుకు ప్రయత్నించిన కోతులు అవి నిజమైన పులులే అని భయపడి చేను లోకి రావడం మానేశాయి. కొన్నాళ్లకు ఆ బొమ్మల మీద రంగు పోవడంతో అవి బొమ్మలేనని కనిపెట్టిన కోతులు.. పంటను మళ్లీ  ఆగం చేయడం మొదలెట్టాయి.

ఇక లాభం లేదనుకున్న శ్రీకాంత్ తన పంటను కాపాడుకునేందుకు ఓ తెలివైన ఉపాయం ఆలోచించాడు. తన పెంపుడు కుక్క (బుల్‌బుల్)కు రంగు వేసి పులి లాగా తయారు చేశాడు.  గోధుమ రంగులో ఉన్న ఆ కుక్క శరీరం మీద నల్లటి రంగుతో పులి చారల్లాగా కనిపించేలా పెయింట్ వేశాడు. ఆ కుక్కను వెంటబెట్టుకొని పొలానికి తీసుకెళ్లగా నిజంగా పులే నడుచుకుంటూ వస్తుందని భయంతో ఆ కోతులు పరుగు తీశాయి. తన ప్లాన్ వర్కవుట్ అయిందని, ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో బుల్‌బుల్ ని పొలానికి తీసుకెళ్లాడు శ్రీకాంత్. మిగతా రైతులు కూడా ఈ ప్లాన్ బాగుందని శ్రీకాంత్ ని ఫాలో అవుతున్నారు.