సినిమా టికెట్ ధర రూ.200కు మించకూడదు.. రూల్ తెచ్చిన కర్ణాటక ప్రభుత్వం

సినిమా టికెట్ ధర రూ.200కు మించకూడదు.. రూల్ తెచ్చిన కర్ణాటక ప్రభుత్వం

బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం అక్కడి సినిమా థియేటర్ల యాజమాన్యాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు 200 రూపాయలకు మించకూడదని కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లు మాత్రమే కాదు మల్టీప్లెక్స్లైనా సరే.. వినోదపు పన్నుతో కలిపి సినిమా టికెట్ ధర 200 రూపాయలకు మించకూడదని కర్ణాటక ప్రభుత్వం రూల్ తీసుకొచ్చింది.

సిద్ధరామయ్య సర్కార్ 2025-26 బడ్జెట్లో భాగంగా కర్ణాటక ప్రజలకు ఈ మేరకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్పై అభ్యంతరాలు గానీ, సలహాలు, సూచనలు గానీ ఉంటే హోం శాఖ అదనపు చీఫ్ సెక్రటరీకి అడ్రస్ చేయాలని నోటిఫికేషన్లో కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. అంతేకాదు.. కన్నడ కంటెంట్ను ప్రమోట్ చేసే ఉద్దేశంతో కర్ణాటక ప్రభుత్వమే ఒక ఓటీటీ వేదికను తీసుకురావాలని భావిస్తోంది. ఈ ఓటీటీ ఫ్లాట్ ఫాంలో కేవలం కన్నడ సినిమాలకు మాత్రమే స్థానం దక్కుతుంది.

ఇటీవల సినిమాల బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో.. భారీ బడ్జెట్ సినిమాలు విడుదలైన మూడు రోజుల పాటు టికెట్ ధరలు 5 వందల పైనే ఉంటున్న పరిస్థితి. ఈ కారణంగా సినిమాలను థియేటర్లో చూసే ఆసక్తి ఉన్న చాలా మంది ప్రేక్షకులు టికెట్ రేట్ల దెబ్బకు వెనకడుగు వేస్తున్నారు. ఓటీటీకి వచ్చాక చూద్దాంలే.. అని థియేటర్కు వెళ్లడం మానేస్తున్నారు. ఇలా చాలా మంది సినీ ప్రేమికులు థియేటర్ అనుభూతిని కోల్పోతున్నారు.

ఈరోజుల్లో భారీ బడ్జెట్ సినిమాలను సామాన్య, మధ్య తరగతి ప్రజలు థియేటర్లో చూసే పరిస్థితి లేకుండా పోయింది. అందుకే.. కర్ణాటక ప్రభుత్వం ప్రజలకు వినోదాన్ని దగ్గర చేసేందుకు సినిమా టికెట్ల ధరలపై ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై మూవీ లవర్స్ నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమైనప్పటికీ.. మ‌ల్టీప్లెక్స్ వ‌ర్గాల‌తో పాటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూట‌ర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.