తెలంగాణలో 24 గంటల కరెంట్..కాంగ్రెస్ కృషి ఫలితమే: కర్ణాటక విద్యుత్ మంత్రి

తెలంగాణలో 24 గంటల కరెంట్..కాంగ్రెస్ కృషి ఫలితమే: కర్ణాటక విద్యుత్ మంత్రి

కర్ణాటకలో కరెంట్ లేదని బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెపుతున్నారని ఆ రాష్ట్ర విద్యుత్ మంత్రి కేజేజార్జ్ అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కర్ణాటకలో రైతులకు అవసరమైన కరెంట్ ను ఇస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నారంటే.. అది గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషి ఫలితమే అని కేజే జార్జ్ చెప్పారు. 

కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 90 శాతం అమలు చేశామన్నారు ఆ రాష్ట్ర విద్యుత్ మంత్రి కేజే జార్జ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి కేబినెట్ సమావేశంలో  5గ్యారంటీలను అమలు చేశామన్నారు. అన్న భాగ్య పథకం కింద 10 కిలోల బియ్యం పేదలకు ఇస్తామని చెప్పాం.. కానీ కేంద్రం బియ్యం సరఫరా చేయకపోవడంతో పేదలకు బియ్యానికి బదులు డబ్బులు ఇస్తున్నామని చెప్పారు. 

రాహుల్ భారత్ జోడో యాత్ర సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను మేనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తున్నామన్నారు. మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ ఇద్దరు ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారని.. పేదల సంక్షేమం కోసం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన 20 సూత్రాల పథకం ఇప్పటికీ అమలవుతుందని చెప్పారు. 

దేశంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతోందని.. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ విస్తరిస్తోందని చెప్పారు జార్జ్. పేదల సంక్షమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని.. పేదల అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తోందన్నారు కర్ణాటక విద్యుత్ మంత్రి కేజే జార్జ్.