- పదవి అంటే కిరీటం కాదు.. బాధ్యత అని చాటి చెప్పిన దార్శనికుడు
- కర్నాటక స్పీకర్ యూటీ ఖాదర్ ఫరీద్
హైదరాబాద్, వెలుగు : స్పీకర్ పదవికే వన్నె తెచ్చిన వ్యక్తి దుద్దిళ్ల శ్రీపాదరావు అని కర్నాటక స్పీకర్ యూటీ ఖాదర్ ఫరీద్ అన్నారు. రాజకీయాల్లో పదవి కిరీటం కాదని.. బాధ్యత అని చాటిచెప్పిన దార్శనికుడు ఆయన అని కొనియాడారు. సోమవారం హైటెక్ సిటీలోని శిల్పాకళా వేదికలో తెలంగాణ భాషా, సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఖాదర్ఫరీద్హాజరై మాట్లాడారు. సర్పంచ్ నుంచి స్పీకర్ వరకు ఎదిగిన శ్రీపాదరావు రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకమన్నారు. చివరి శ్వాస వరకు విలువలతో కూడిన రాజకీయం చేశారని గుర్తుచేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా మంత్రి శ్రీధర్ బాబు ప్రజా సేవలో ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. తండ్రి ఆశయ సాధన కోసం కృషి చేస్తానని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్, ఎమ్మెల్యేలు విజయరమణారావు, రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్, ఆది శ్రీనివాస్, ప్రేమ్ సాగర్ రావు, గండ్ర సత్యనారాయణ, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, అరికెపూడి గాంధీ, మల్ రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీలు సురభివాణీదేవి, బల్మూరి వెంకట్ పాల్గొన్నారు.
