కార్తీక మాసం కొనసాగుతుంది. శివుడికి అత్యంత ఇష్టమైన ఈ మాసంలో భక్తులు పరమేశ్వరుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఉపవాసాలు, దీపారాధన చేస్తారు. నైవేద్యం సమర్పిస్తారు. కార్తీక మాసంలో శివుడికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలు ఎలా చేయాలో చూద్దాం.
ఉసిరికాయ రైస్ తయారీకి కావలసినవి
- ఉసిరికాయలు : 6 నుంచి 8
- ఉప్పు, పసుపు : తగినంత
- బియ్యం: రెండు కప్పులు
- ఎండు మిరపకాయలు : 6
- ఇంగువ : చిటికెడు
- తాలింపు గింజలు: సరిపడ
- జీడిపప్పు: 5
- తగినంత : నూనె
తయారీ విధానం: ముందుగా ఉసిరి కాయల్ని కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఈ ముక్కలో నాలుగైదు పచ్చి మిరపకాయలు, టీస్పూన్ జీలకర్ర, రెండు కట్టల కొత్తిమీద కొద్దిగా ఉప్పు వేయాలి. అన్నీ కలిపి గ్రైండ్ చేయాలి. మెత్తగా నూరిన ఉసిరి ముద్దను పక్కన పెట్టాలి. వీలుంటే కొద్దిగా నిమ్మరసం కూడా కలపొచ్చు. బియ్యాన్ని కడిగి పొడిగా ఉండేలా అన్నం వండాలి. తర్వాత ఉడికిన అన్నాన్ని తీసుకుని మరోపెద్ద గిన్నెలో వేయాలి. అన్నం మధ్యలో ఉసిరి ముద్ద వేసి అన్నంతో కప్పి ఉంచాలి.
అనంతరం మరో కడాయిలో నూనె వేసి వేడి చేసి పోపు గింజలు.. ఎండు మిరప కాయలు వేసి కొద్దిగా వేగించాలి.. కొంచెం ఇంగువ కూడా కలపాలి. వచ్చి మిరప కాయల్ని ముక్కలు వేయాలి. ఇవి వేగేసరికి కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి. చివర్లో కొద్దిగా కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని, పక్కన పెట్టుకున్న అన్నంలో కలపాలి. వీలైతే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు అన్నంతోపాటు... ఉసిరి ముద్ద. ..పోపు కలిసేలా బాగా కలపాలి అంతే. ఉసిరికాయ అన్నం రెడీ రెగ్యులర్ పులిహోరకు బదులు ఈ ఐటమ్‌ను ట్రై చేయండి. ఉసిరికాయలోని పోషక విలువలు అందుతాయి. ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది. పల్లీలకు బదులు జీడిపప్పు వేయడం వల్ల ఇది ఎంతో రుచిగా ఉంటుంది.
అటుకుల పొంగలి తయారీకి కావలసినవి
- పెసరపప్పు :1 కప్పు
- బెల్లం 1 :కప్పు
- అటుకులు :1 కప్పు
- పాలు: 1 కప్పు
- నెయ్యి : 1 లేదా 2 టీస్పూన్లు,
- జీడిపప్పు :10 పలుకులు
- బాదం : 10పలుకులు,
- ఎండుద్రాక్ష :10 పలుకులు
- యాలకుల పొడి :చిటికెడు
తయారీ విధానం: ముందుగా 20 నిమిషాల పాటు పెసరపప్పును నానబెట్టాలి. బాండీలో నెయ్యి వేసి అందులో జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం, అటుకులు వేసి కరకరలాడేలా వేయించాలి. తరువాత ఆదే వాండీలో మరికొంచెం నెయ్యి వేసి అందులో నానబెట్టిన పెసరపప్పు వేసి వేయించాలి. అందులో పాలు కొద్దిగా నీళ్లు పోసి... పెసరపప్పు 70శాతం మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. ముందుగా వేయించిన అటుకుల మిశ్రమాన్ని ఆ పెసరపప్పు మిశ్రమంలో వేసి ఒక నిమిషం పాటు ఉడికించాలి. తర్వాత అందులో యాలకుల పొడి, బెల్లం వేసి అది కరిగేవరకు మూత పెట్టి చిన్న మంట మీద 5 నిమిషాలు ఉడికిస్తే అటుకుల పొంగలి రెడీ..
రవ్వ పులిహార తయారీకి కావాల్సిన పదార్థాలు:
- బొంబాయి రవ్వ : ఒక కప్పు
- నిమ్మరసం :పావు కప్పు
- పచ్చిమిర్చి: 5 లేదా 6
- కరివేపాకు : తగినంత
- పసుపు, ఉప్పు : తగినంత
- జీలకర్ర, ఆవాలు: అరటీ స్పూన్
- నూనె: మూడు టేబుల్ స్పూన్లు
- ఎండుమిర్చి : నాలుగు
- పల్లీలు :రెండు టేబుల్ స్పూను
- శనగపప్పు : రెండు టేబుల్ స్పూన్లు
- మినప్పప్పు :రెండు టేబుల్
తయారీ విధానం : కప్పున్నర నీటిలో రవ్వ వేసి ఉడికించుకోవాలి. దీనిలోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. రవ్వ ఉండలు కట్టకుండా ఉడికించాలి. ఈ రవ్వను వేరే గిన్నెలో ఉంచుకోవాలి. చిన్న పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు వేయాలి. తర్వాత ఎండు మిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్న రవ్వలో కలపాలి. ఇందులో నిమ్మరసం కూడా కలిపి ఉప్పు సరిచేసుకోవాలి.
పెసర పూర్ణాలు తయారీకి కావాల్సినవి
- పెసర పప్పు: ఒక కప్పు
- బెల్లం :ఒక కప్పు
- నీళ్లు :ఒక కప్పు
- బియ్యం: రెండు కప్పులు
- మినప్పుప్పు: ఒక కప్పు
- యాలకుల పొడి : ఒక టేబుల్ స్పూన్
- ఉప్పు: పావు కప్పు
- నూనె: తగినంత
తయారీ విధానం: పెసర పప్పును ఆరు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టాలి. బియ్యం, మినప్పుప్పును కలిపి నాలుగు నుండి ఆరు గంటలు నానబెట్టి .. తర్వాత మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమం దోశ పిండిలాగా ఉండాలి. ఈ మిశ్రమానికి కొద్దిగా ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. అనంతరం పెసరపప్పును కుక్కర్లొ వేసి, తగినన్ని నీళ్లు పోసి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత పెసరపప్పును మెత్తగా చేసుకోవాలి. దీనికి బెల్లం కలిపి పది నిమిషాలు సన్నని మంటపై ఉడికించాలి.
బెల్లం కలిపితే కాస్త గట్టిగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చిన్న కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. బెల్లం, పెసర ఉండల్ని తీసుకుని మినప్పప్పు మిశ్రమంలో ముంచినూనెలో, వేయించాలి. ఇవి కొద్దిగా రంగు మారే వరకు వేయించాలి. ఇవి ఇయిల్ ఫ్రై అయిన తర్వాత బయటకు తీసి టిష్యూ పేపర్లో ఉండాలి. వీటిపై కొద్దిగా నెయ్యి పోసి వడ్డిస్తే రుచిగా ఉంటాయి.
