కాశ్మీర్ ఎప్పటికీ మాదే..

కాశ్మీర్ ఎప్పటికీ మాదే..
  • అఫ్రిదికి గట్టి కౌంటర్ ఇచ్చిన శిఖర్ ధావన్

న్యూఢిల్లీ: కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేసిన అనుచిత కామెంట్లను మన క్రికెటర్లు తిప్పికొడుతున్నారు. మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్ ఇప్పటికే గట్టి కౌంటర్ ఇచ్చారు. తాజాగా యువరాజ్ సింగ్, శిఖర్ ధవన్.. అఫ్రిది కామెంట్స్ పై మండిపడ్డారు. అఫ్రిది కామెంట్స్ బాధించేలా ఉన్నాయని యువరాజ్ సింగ్ ట్వీట్ చేశారు. కాశ్మీర్ ఎప్పటికీ మాదేనని శిఖర్ ధావన్ ధీటుగా సమాధానం ఇచ్చారు.

మాలో ఒక్కరు లక్షమందితో సమానం
‘‘ప్రపంచం అంతా కరోనాతో పోరాటం చేస్తున్న ఇలాంటి సమయంలో.. మీరు మాత్రం కాశ్మీర్ పై పడి ఏడుస్తున్నారు. కాశ్మీర్ ఒకప్పుడు మాదే. ఇప్పుడు మాదే. భవిష్యత్తులోనూ మాదే. ఎప్పటికే మాదే. మీరు 22 కోట్ల మందిని తీసుకొచ్చినా సరే.. మావాళ్లు ఒక్కొక్కరు లక్షమంది సైన్యంతో సమానం”అని శిఖర్ సోమవారం ట్వీట్ చేశారు.

నీతో దోస్తీ లేదిక: బజ్జీ, యువీ
‘‘పాకిస్తాన్ ప్రజల్ని మోసం చేసేందుకు అక్కడి ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అఫ్రిది, బజ్వా లాంటి జోకర్లు ఇండియాపై, మోడీపై అవాక్కులు పేలుతున్నారు. అయినా సరే.. మీరెప్పటికీ కాశ్మీర్ ను పొందలేరు. బంగ్లాదేశ్ సంగతి గుర్తులేదా?” అని గౌతమ్ గంభీర్ ట్వీట్ చేశారు. ‘‘కరోనా బాధితులకు సాయం కోసం నువు అడగ్గానే నేను యువీ సాయం చేశాం. కానీ మరోసారి చేయలేము. మా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే హక్కు నీకు లేదు. స్నేహితుడని పిలిచినందుకు బాధపడుతున్నాం. ఆ అర్హత కూడా నీకు లేదు”అని అఫ్రిదినుద్దేశించి హర్బజన్ సింగ్, యువరాజ్ సింగ్ ట్వీట్ చేశారు.

కరోనా బాధితులకు స్వచ్ఛంద సంస్థ ద్వారా సాయం చేస్తున్న అఫ్రిది ఆదివారం  పీవోకేలో పర్యటించాడు. అక్కడి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. పాక్ సైన్యం ఎంత ఉందో.. అంతమంది సైన్యాన్ని ఇండియా ప్రధాని కాశ్మీర్ లో మోహరించారని వివాదాస్పద కామెంట్ చేశాడు. ఆయన మనసులో కరోనా కంటే దారుణమైన జబ్బు ఉందని విద్వేశాలు రెచ్చగొట్టేలా మాట్లాడాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అఫ్రిదిపై మనదేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.