
- సీడీలను ఇస్తున్న ప్రైవేట్ స్కూల్ టీచర్లు
- చాలా చోట్ల ఆంక్షలు ఎత్తేసిన అధికారులు
జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితి ప్రశాంతంగా కనిపిస్తోంది. కాశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో అధికారులు ఆంక్షలు ఎత్తేశారు. జమ్మూ, శ్రీనగర్‌లో దాదాపు 4వేల స్కూళ్లను ఓపెన్ చేసినట్లు అధికారులు చెప్పారు. స్కూళ్లు తెరుచుకున్నప్పటికీ స్టూడెంట్స్ మాత్రం రావడం లేదు. దీంతో ప్రైవేట్ స్కూల్ టీచర్లు ఆన్‌లైన్ క్లాసులు చెప్తున్నారు. పాఠాలను సీడీల్లో రికార్డ్ చేసి వాటిని స్టూడెంట్లకు అందిస్తున్నారు. “ స్కూల్స్ ఓపెన్ చేసినా పిల్లలు రావట్లేదు. అందుకే సీడీలు ఇస్తున్నాం. పేరెంట్స్‌తో వచ్చి వాళ్లు సీడీలు తీసుకుని వెళ్లిపోతున్నారు” అని ఓ టీచర్ చెప్పారు. గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్‌కు ఈ సదుపాయం లేకపోవడంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. 10, 11, 12 తరగతుల విద్యార్థులు బోర్డ్ ఎగ్జామ్స్‌కు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వస్తున్నారని, క్లాసులకు అటెండ్ కావడం లేదని టీచర్లు చెప్పారు. స్కూళ్లు తెరుచుకున్నాయని టీవీల్లో చూసి వస్తే ఇక్కడ పరిస్థితి వేరేలా ఉందని జిన్నాత్ అనే స్టూడెంట్ చెప్పింది. దాదాపు ఏడు కిలోమీటర్ల దూరం నుంచి నడిచి వచ్చానని, ఇక్కడకు వచ్చి చూస్తే క్లాసులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
48శాతం సిలబస్ మాత్రమే పూర్తయింది
ఇప్పటి వరకు కేవలం 48 శాతం సిలబస్ మాత్రమే పూర్తయిందని విద్యాశాఖ అధికారులు చెప్పారు. “ 10,11,12 తరగతులకు అక్టోబర్ చివరి వారంలో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. గవర్నమెంట్‌ఈ నిర్ణయం తీసుకుంటుందని ఎవరికీ తెలియదు. పరీక్షల టైంకి సిలబస్ కంప్లీట్ కాకపోతే ఏం చేయాలో అర్థం కావడం లేదు” అని శ్రీనగర్‌లోని గవర్నమెంట్ స్కూల్ టీచర్ చెప్పారు. ఇంటర్నెట్ లేక చాల ఇబ్బందులు పడుతున్నామని కాలేజ్ స్టూడెంట్స్ చెప్పారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు అప్లై చేయాలంటే నెట్ లేదని, కొన్ని ఎగ్జామ్స్‌కు లాస్ట్ డేట్ కూడా అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెరుచుకోని మార్కెట్లు
కాశ్మీర్ లోయలో దాదాపు 90 శాతం ఏరియాల్లో అధికారులు ఆంక్షలు ఎత్తేశారు. 96 టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌ల పరిధిలోని ల్యాండ్‌లైన్లను పునరుద్ధరించారు. ఇంటర్నెట్, మొబైల్ సర్వీసులపై వరుసగా 30వ రోజూ బ్యాన్ ఉంది.