ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్దమయ్యింది. శుక్రవారం ( మే 15 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం భీమవరం దగ్గర ఎన్ హెచ్ 16పై కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్దమయ్యింది. బస్సు ఇంజిన్ నుంచి పొగ రావడం గమనించిన డ్రైవర్ బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను దించేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ అప్రమత్తతో 36 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు.
ఈ ఘటనలో ప్రాణనష్టమేమి జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాలతో బయటపడ్డామని అంటున్నారు ప్రయాణికులు.
