హైదరాబాద్, వెలుగు : ‘ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మెడపై కత్తి వేలాడుతున్నది. ఏ క్షణమైనా ఆమె అరెస్టు కావచ్చు. దీనిని ఎవరూ ఆపలేరు’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ సయ్యద్ జాఫర్ ఇస్లాం స్పష్టం చేశారు. ‘ఇదే కేసులో ఇప్పటికే ఆమ్ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియా జైలులోనే ఉన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయం’ అని జాఫర్ పేర్కొన్నారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ సర్కార్ కుంభకోణాల ప్రభుత్వమని, తెలంగాణకు సేవ చేస్తానని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కుటుంబం.. రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నదని మండిపడ్డారు.
ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తున్నదని, సాగునీటి ప్రాజెక్టులు మనీ మేకింగ్ మెషీన్ లుగా మారాయని ఆయన ఆరోపించారు. అవినీతిని కేంద్ర ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించదని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్, మజ్లీస్, కాంగ్రెస్ ల బంధాన్ని కూడా ప్రజల ముందు పెడతామని అన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏంటో అందరికీ తెలుసని, రాబోయే రోజుల్లో అయన గురించి కూడా ప్రజలకు చెప్తామన్నారు. పార్లమెంట్లో బీఆర్ఎస్.. కాంగ్రెస్ కు అనుకూలంగా పనిచేస్తున్నదన్నారు.
అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం .. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని, యువతకు ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని, బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని జాఫర్ పేర్కొన్నారు.
