మహిళా బిల్లుపై కాంగ్రెస్, బీజేపీ మోసం: ఎమ్మెల్సీ కవిత

మహిళా బిల్లుపై కాంగ్రెస్, బీజేపీ మోసం: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, వెలుగు: చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్, బీజేపీ మోసం చేశాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం ట్వీట్ చేశారు. బీఆర్ఎస్​లో మహిళలకు టికెట్లపై బీజేపీ స్టేట్​చీఫ్​ కిషన్​రెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి చేసిన కామెంట్లను ఆమె ఖండించారు. స్థానిక సంస్థల్లో మహిళకు రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టే దేశంలో 14 లక్షల మందికి ప్రాతినిధ్యం దక్కిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి భారీ మెజార్టీ ఉన్నా.. మహిళా రిజర్వేషన్​ బిల్లు ఎందుకు చట్టంగా మారలేదో కిషన్​రెడ్డి చెప్పాలన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీ రెండుసార్లు హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్​సహా ఇతర పార్టీలు మహిళలకు ఎన్ని టికెట్లు ఇస్తాయో చూద్దామన్నారు. బీఆర్ఎస్​టికెట్లపై అక్కసు వెళ్లగక్కుతున్న పార్టీలు ఇక్కడ టికెట్లు రానివారిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని, వాళ్ల రాజకీయ అభద్రతా భావాన్ని మహిళల సీట్లతో ముడిపెట్టడం సరికాదని కవిత అన్నారు. దేశాన్ని 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్..​మహిళల కోసం ఏం చేసిందో చెప్పాలన్నారు. మహిళా రిజర్వేషన్​బిల్లు కోసం పదేండ్లలో సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ, గాంధీ భవన్​గాడ్సే రేవంత్​రెడ్డి ఏ ఒక్క రోజు కూడా ప్రధానిని ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలన్నారు. ఓడిపోయే యూపీలో 33 శాతం మహిళలకు సీట్లిచ్చి.. గెలిచే కర్నాటకలో 15 సీట్లే ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. 34 మంది మంత్రుల్లో ఒక్క మహిళకు మాత్రమే అవకాశం ఇచ్చుడేందో చెప్పాలన్నారు. మహిళా రిజర్వేషన్లు కల్పించాలన్న తమ డిమాండ్​పై, ఉద్యమకారులపై తుపాకీ ఎత్తిన రేవంత్​వెకిలిగా మాట్లాడారని మండిపడ్డారు.