ప్రైవేట్‌‌ నర్సులకు హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ ఇవ్వాలె : టీఆర్‌‌ఎస్‌‌ చీఫ్‌‌ కవిత

ప్రైవేట్‌‌ నర్సులకు హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ ఇవ్వాలె : టీఆర్‌‌ఎస్‌‌ చీఫ్‌‌ కవిత
  • ఆస్పత్రుల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చించాలె: టీఆర్‌‌ఎస్‌‌ చీఫ్‌‌ కవిత

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రైవేట్‌‌ ఆస్పత్రుల్లో పనిచేసే నర్సులకు హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ లేకపోవడం బాధాకరమని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌‌ఎస్‌‌) చీఫ్‌‌ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం బంజారాహిల్స్‌‌లోని పార్టీ ఆఫీసులో ప్రైవేట్‌‌ ఆస్పత్రుల నర్సులు, ఆదివాసీ టైగర్‌‌ సేన నేతలు ఆమెను కలిశారు. ఈ సందర్భంగా ఆదివాసీ టైగర్‌‌ సేన నేతలు పార్టీలో చేరారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. ప్రైవేట్‌‌ ఆస్పత్రులు ప్రజల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నా, సిబ్బందికి కనీసం హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ కల్పించకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వం ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చించి నర్సులకు ఇన్సూరెన్స్‌‌ అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌ చేశారు. 

పనివేళలు, జీతాలు, ఓవర్‌‌టైమ్‌‌ విషయంలో తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని, దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలోని ఆదివాసీలకు పౌష్టికాహారం, రక్షిత తాగునీరు అందించాలని కవిత కోరారు. కొమరం భీమ్‌‌ వర్ధంతి నాటికి కెరమెరి నుంచి జోడేఘాట్‌‌ వరకు డబుల్‌‌ రోడ్డు నిర్మించాలని డిమాండ్‌‌ చేశారు. అడ ప్రాజెక్టు, ఎన్టీఆర్‌‌ సాగర్‌‌ కాల్వలను ఆధునీకరించి 60 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరించి, గతంలో హక్కుపత్రాలు పొందిన ఆదివాసీలకు భూములు అప్పగించాలని కోరారు. త్వరలో ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటిస్తామని తెలిపారు.