జాగృతి బ్యానర్ నుంచి కేసీఆర్ ఫొటో ఔట్...నా తోవ నేను వెతుక్కుంటున్నానన్న కవిత

జాగృతి బ్యానర్ నుంచి కేసీఆర్ ఫొటో ఔట్...నా తోవ నేను వెతుక్కుంటున్నానన్న కవిత
  • ఇంకా ఆ చెట్టు కింద ఉండలేను
  • కేసీఆర్ ఫొటో పెట్టుకోవడం నైతికత కాదు
  • జయశంకర్ సార్ ఫొటో వాడుతాను
  • ‘జాగృతి జనంబాట’ పై ఎమ్మెల్సీ కవిత 
  • ఈ  నెల 25న నిజామాబాద్ లో ప్రారంభం

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన కవిత తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు కేసీఆర్ ఫొటోను తన బ్యానర్ లో వాడుకున్న కవిత .. ఇకపై తన తండ్రి ఫొటో వాడనని తేల్చేశారు. దీంతో బాపు కేసీఆర్ ఫొటో లేకుండానే కవిత యాత్ర సాగనుంది. కేసీఆర్ ఉద్యమకారుడని, తెలంగాణ తెచ్చిన వ్యక్తి అని కానీ ఆయన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారని అన్నారు. 

ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఆ చెట్టు కింద ఉండలేనని అన్నారు. తన తోవ తాను వెతుక్కుంటున్నానని కవిత చెప్పారు. కేసీఆర్ ఫొటో పెట్టుకోవడం కూడా నైతికత కాదని చెప్పారు. తన బ్యానర్ పై జయశంకర్ సార్ ఫొటో పెట్టుకుంటానంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 25 నుంచి తాను తెలంగాణ వ్యాప్తంగా జాగృతి జనంబాట పేరుతో యాత్ర చేయనున్నట్టు కవిత ప్రకటించారు. 

ఈ మేరకు సంస్థ కార్యాలయంలో ఇవాళ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ నెల 25 న నిజామాబాద్ జిల్లాలో తన యాత్ర మొదలవుతుందని వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 13తో తన యాత్ర హైదరాబాద్ లో ముగుస్తుందని అన్నారు. తన యాత్రకు సంబంధించిన షెడ్యూల్ ను కూడా కవిత రిలీజ్ చేశారు.