- గుంటనక్కలు, తోడేళ్ల చేతుల్లో బందీ అయిండు: కవిత
- హైడ్రాతో ఇండ్లు కూలుస్తున్నా..
- రైతుల పొలాలు మునిగినా..
- చేవెళ్ల ప్రమాదం జరిగినా రాలే
- ప్రజలకు కష్టం వస్తే ఆ సారు రారు.. నేషనల్ పార్టీ అంటూ
- బిహార్, గుజరాత్, పంజాబ్‌కు పోతరు
- మునుపటి కేసీఆర్ అయ్యుంటే పాలమూరు ప్రాజెక్టును
- కుర్చీ వేసుకుని పూర్తి చేయిస్తుండే
- తెలంగాణ వచ్చాక అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా?
- ప్రజలు తప్పు చేసిన్రని కేసీఆర్ పరిణతి కోల్పోయి మాట్లాడుతున్నడు
- కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పిన నన్ను బయటకు పంపిండు
- అవినీతి చేసిన పందికొక్కులను పక్కన పెట్టుకున్నడు
- రాష్ట్ర సీఎం కర్కోటకుడు.. హిట్లర్ అంటూ కామెంట్స్
- ఇప్పుడు రాష్ట్రానికి తాను అమ్మగా మారాలనుకుంటున్నానని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం వచ్చాక బీఆర్‌ఎస్ పార్టీ పదేండ్లు అధికారంలో ఉన్నా అనుకున్న లక్ష్యాలను సాధించలేదని తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కవిత విమర్శించారు. తొలి సీఎంగా రాష్ట్రంలో కేసీఆర్ సామాజిక న్యాయం, నిధులు, నీళ్లు, నియామకాల్లో మంచి సాలు తీయాల్సి ఉన్నా తీయలేదన్నారు. ఉద్యమం నాటి కేసీఆర్, ఇప్పటి కేసీఆర్ వేరని, ఇయ్యాల్టి కేసీఆర్ మారిన మనిషి.. మర మనిషి.. మన మనిషి కాదని వ్యాఖ్యానించారు. శనివారం మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ హాల్‌లో పార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రకటించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తోపాటు బీజేపీ, కాంగ్రెస్ నేతలపై కామెంట్స్ చేశారు. ‘‘ఉద్యమం నాటి కేసీఆర్ వేరు.. ఇప్పటి కేసీఆర్ వేరు. హైడ్రాతో ఇండ్లు కూలుస్తుంటే.. అన్నా ఎక్కడున్నవ్.. రా అంటే వచ్చిండా? రాలే.. వెలుగుమట్లలో ఇండ్లు కూలితే రాలే.. వర్షబీభత్సంతో రైతుల పొలాలు మునిగితే రాలే.. చేవెళ్ల దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే రాలే.. ప్రజలకు ఎక్కడ ఎంత కష్టం వచ్చినా.. ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి.. మర మనిషి. గుంటనక్కలు, తోడేళ్ల చేతుల్లో ఖైదీ అయిన మనిషి. మన మనిషి కాదు. ఇది సంతోషంతో చెప్తున్న మాట కాదు. దు:ఖం, ఆవేదనతో చెప్తున్న మాట’’ అని అన్నారు.
‘ఆనాటి కేసీఆర్ ఆర్డీఎస్ నీళ్ల కోసం పాదయాత్ర చేసిండు. కానీ, పదేండ్లు అధికారంలో ఉండి కూడా పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేదు. ఆనాటి కేసీఆర్అయ్యుంటే.. పాలమూరు మీద ప్రేముంటే ఆ ప్రాజెక్ట్ దగ్గర కుర్చీ వేసుకొని దానిని కట్టిస్తుండే. కానీ, మారిన కేసీఆర్ గుజరాత్, పంజాబ్, బిహార్‌కు పోయిండు. నేషనల్ పార్టీ పెడతం అని పోయారు తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. తెలంగాణను పట్టించుకుని ఉంటే.. కేంద్రంతో గొడవ పెట్టుకుని ఉండకపోయుంటే ఇవాళ పాలమూరు –రంగారెడ్డి నీళ్లు పారకపోయేవా? నేను ఇన్ని రోజులు మాట్లాడుతున్నా బీఆర్‌ఎస్ నాయకులు సమాధానం చెప్పట్లేదు. దీనికి ఇప్పుడైనా మీరు సమాధానం చెప్పకుంటే.. ప్రజలే మిమ్మల్ని బయటకు లాగి సమాధానం చెప్పిస్తరు. నాడు సింగరేణిలో ఓ కార్మికుడు చనిపోతే అక్కడిదాకా వెళ్లి చూసొచ్చిన వ్యక్తి కేసీఆర్. కానీ, తెలంగాణ వచ్చాక ఆ ప్రేమ ఏమైంది? అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా?’’ అని కవిత నిలదీశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.1.89 లక్షల కోట్లు ఖర్చు పెట్టి 14 లక్షల ఎకరాలకే నీళ్లిచ్చారన్నారు. ఇందులో పాలమూరు– రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు రూ.1.21 లక్షల కోట్లు ఖర్చు చేసినా కేవలం లక్ష ఎకరాలకే నీళ్లు అందాయని తెలిపారు.
బీజేపీకి తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదు
బీజేపీకి తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదని కవిత విమర్శించారు. ‘‘తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని ఆ పార్టీ పెద్దలంటున్నరు. నిన్నగాక మొన్న మెడకాయమీద తలకాయలేని ఓ ఎంపీ.. ఇండియా, పాకిస్తాన్‌ను విడదీసినట్టు తెలంగాణ, ఏపీలను విడదీశారన్నడు. వాళ్ల పార్టీ అగ్రనాయకులు ఇన్ని మాటలంటున్నా.. మన దగ్గరున్న బీజేపీ బానిస ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మన ఏడు మండలాలు పక్క రాష్ట్రంలో కలిపితే.. పార్లమెంట్‌లో పళ్లు ఇకిలిస్తరు తప్ప ఒక్క మాటా మాట్లాడలేదు. విభజన హామీలు నెరవేర్చకున్నా ఆ బీజేపీ బానిస ఎంపీలు ఒక్క మాట కూడా ఇప్పటికీ మాట్లాడరు. సామాజిక న్యాయానికి బీజేపీ బద్ధ వ్యతిరేకి. మహిళా బిల్లును మోసపూరితంగా పక్కకుపడేలా చేశారు. బీసీ బిల్లును పంపిస్తే దానినీ తొక్కి పెట్టారు. కులగణన చేస్తామని తొక్కిపెట్టిన్రు. అత్యంత పేదలకు రెండు పూటల అన్నం పెట్టే ఉపాధి హామీ పథకాన్నీ బంద్చేసిపెట్టిన్రు. భద్రాచలం దగ్గర ఓ ఐదు గ్రామాలు ఏపీలోకి వెళ్లాయి. ఆ ఊర్లు పోలవరం ప్రాజెక్టుతో మునిగితే భద్రాచలం గుడి మునిగిపోతుంది. ఈ బీజేపీ ఎంపీలు తెలంగాణ బిడ్డలే అయితే.. సిగ్గు ఎగ్గు ఉంటే ఆ ఐదు గ్రామాలను తెలంగాణకు తిరిగి తీసుకురావాలి. భద్రాచలం రాముడు.. రాముడు కాదా? ఆయన గుడి మునిగిపోవాలా?’’ అని ఆమె ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలో కర్కోటకుడి పాలన..
ఇవాళ రాష్ట్రంలో కర్కోటకుడి పాలన నడుస్తున్నదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఖమ్మం వెలుగుమట్లలో అర్ధరాత్రి ఇండ్లు కూలిస్తే.. ఓ నిండు గర్భిణికి టెన్షన్ తట్టుకోలేక అబార్షన్ అయింది. అప్పుడు ఆ తండ్రి ఏడ్చిన ఏడుపులు ఇప్పటికీ నా చెవుల్లో వినపడుతూనే ఉన్నయ్. అందుకే ఇప్పుడున్న సీఎంని కర్కోటకుడు, హిట్లర్ అనే అంట. కుమ్మెరలో రెండు నెలల పసికందు చనిపోతే ఇప్పటికీ కేసు పెడ్తలేరు. హోంమంత్రి కూడా ముఖ్యమంత్రే. గురుకులాల్లో విషం పెట్టి విద్యార్థులను చంపుతున్నరు. అయినా విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న సీఎం మాట్లాడతలే. కర్ల రాజేశ్ అనే దళిత యువకుడు పోలీస్ కస్టడీలో చనిపోతే ఇప్పటికీ పోలీసు అధికారులపై చర్యలు తీసుకోలేదు. అందుకే పిడికిలి బిగించి ఇప్పుడున్న రాక్షస కాంగ్రెస్ పాలనపై కచ్చితంగా పోరాడుతాం. ఇప్పుడు మనమే ప్రధాన ప్రతిపక్షం.. రెండేండ్ల తర్వాత మనమే అధికార పక్షమైతం. ఈ మూడు పార్టీలు అధర్మం, అవినీతి, బంధుప్రీతి, కుటుంబం అవినీతి పాలనతో నిండిపోయినయ్. అందుకే ఆ మూడు పార్టీలపై పాంచజన్యం పూరిద్దాం’’ అని ఆమె పిలుపునిచ్చారు. అవతలివైపున్నోడు మనోడైనా.. అధర్మంవైపు ఉంటే యుద్ధం చేసేందుకు తాను సిద్ధమని పేర్కొన్నారు.
సామాజిక తెలంగాణ రథ చక్రం విరిగిపోయింది..
కష్టపడి తెలంగాణ తెచ్చుకొని 12 ఏండ్లవుతున్నా.. మనం అనుకున్న కలలు నిజం కాలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ నేతృత్వంలోని ఆనాటి తెలంగాణ ఉద్యమ రథం ఎక్కడో దారి తప్పిందని అన్నారు. ప్రజల ఆర్తిని అర్థం చేసుకోలేకపోయిందని వ్యాఖ్యానించారు. సామాజిక తెలంగాణ రథ చక్రం విరిగి ముక్కలై పోయిందని పేర్కొన్నారు. ‘‘తెలంగాణ వస్తే బానిస సంకెళ్లు పోతయనుకున్నం. కానీ, రైతులకు బేడీలు పడ్డయ్. ఇసుక దందాతో నేరెళ్లలో దళితులకు దెబ్బలు పడ్డయ్. చావులైనయ్. ఒకరిద్దరు ఎవరైనా ఫోన్‌లో మాట్లాడుకోవాలనుకుంటే.. ఎవరు వింటారోనని భయం. వ్యక్తిగత స్వేచ్ఛ లేదు.
దారుణమైన నిఘా నీడలో తెలంగాణ బతికింది. ఇది వాస్తవం. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో నేను కూడా ఒకభాగం. అందుకు కొన్ని విషయాల్లో నేను సిగ్గుపడుతున్నా. తెలంగాణ ప్రజలను క్షమించమని కోరుతున్నా. అదే సమయంలో తెలంగాణ సాధించినందుకు గర్వపడుతున్నా. నా జన్మ ధన్యమైంది. అయితే, ఏ సామాజిక తెలంగాణ రావాలని కోరుకుంటున్నమో దాని కోసం నడుంబిగించి పని చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసమే తెలంగాణ రాష్ట్ర సేన ప్రజల ముందుకు వచ్చింది’’ అని ఆమె పేర్కొన్నారు.
ఎన్నికల్లో పోటీ చేయడానికి బాగానే ఉన్నా.. పార్టీకి ఓ ఆత్మ అనేది ఉండాలన్నారు. బీఆర్ఎస్కు ఇప్పుడు అదే లోపించిందని చెప్పారు. తెలంwగాణ అనే ఆత్మను ఆ పార్టీ కోల్పోయిందన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర సేన వచ్చిందని తెలిపారు. 3.5 కోట్ల మందికి ఓ అమ్మలా పరిణతి చెందాలనుకుంటున్నానని కవిత చెప్పారు. ‘‘అమ్మతనంతో పరిపాలన చేసినప్పుడే.. బిడ్డకు ఏదైనా కష్టం వస్తే అమ్మ హృదయం బద్దలవుతుంది. అలాంటి దు:ఖం, ఆర్తి, సంవేదంతో పరిపాలన జరిగినప్పుడే రాష్ట్రం ముందుకు పోతది.. ప్రజల కష్టాలు పోతయ్.
తెలంగాణలో ఎన్నో ఏండ్లపాటు భూస్వామ్య పాలన నడిచింది. ఎన్నో పోరాటాలు జరిగాయి. సమానత్వం కోసం పోరాడుతూనే ఉన్నం. రైతాంగ సాయుధ పోరాటం, ముల్కీ 1952 ఉద్యమం, 1969 తెలంగాణ ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం, తెలంగాణ మలిదశ ఉద్యమం కావొచ్చు.. అనేక సామాజిక ఉద్యమాలు జరిగాయి. వాటి వల్లే అంతో ఇంతో సమానత్వం వచ్చింది. ఇప్పుడు కూడా రాజకీయ శక్తికి ప్రజాపోరాటాన్ని జత చేసి కావాల్సిన సామాజిక తెలంగాణను సాధిస్తం’’ అని ఆమె తెలిపారు.
కేసీఆర్ పరిణతి కోల్పోయి మాట్లాడుతుండు
కేసీఆర్ తనకు తండ్రి అయితే కావొచ్చుగానీ.. ఓ రాజకీయ నాయకుడిగా ఆయన పరిణతి కోల్పోయి మాట్లాడుతున్నారని కవిత విమర్శించారు. ‘‘కేటీఆర్ మాట్లాడిండంటే ఆయనకు తెలియదు అనుకోవచ్చు. కానీ, ప్రజలు తప్పు చేసిన్రని కేసీఆర్ అంటున్నరు. సరే తప్పు చేసిన్రే అనుకుందాం. ఓ తల్లిగా కొడుకు కిందపడి దెబ్బతగిలితే దగ్గరకు తీసుకుని మందు వెయ్యనా.. అట్లనే ఇడిసిపెడతనా? ప్రజలు తప్పు చేసిన్రనుకుంటే.. ఇవాళ కర్కోటకుడి పాలన నడుస్తున్నది రాష్ట్రంలో.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నరు.. గోస పడుతున్నరు.. ఏడుస్తున్నరు. అర్ధరాత్రి ఇండ్లమీద పడి కూలగొడుతుంటే.. ఆదుకోవాల్సిన అమ్మ లాంటి మన కేసీఆర్ ఎక్కడున్నరు? నన్ను పార్టీ నుంచి బయటకు గెంటేస్తే నేను వెంటనే పార్టీ పెట్టాలనుకోలేదు. మారుతరేమో అని పదే పదే వేచి చూసిన. నన్ను పార్టీ నుంచి బయటకు పంపి పది నెలలైంది. నాకు మంచే జరిగింది. ఆనాడే ఉద్యమకారులకు జరిగిన అన్యాయం గురించి అడగాల్సింది. ఆనాడు మీకు జరిగింది.. ఈ నాడు నాకు జరిగింది. బీఆర్‌ఎస్ పార్టీ కోసం ఇండ్లు, ఆస్తులు అమ్ముకుని పనిచేసిన కార్యకర్తలు ఎక్కడున్నారిప్పుడు? తెలంగాణను వ్యతిరేకించి ఉద్యమాన్ని తొక్కిపెట్టి లాఠీలతో కొట్టించిన వ్యక్తులను తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు.
వాళ్ల కార్యకర్తలు మిడతల దండులాగా మన కార్యకర్తలమీద పడితే.. తల్లికోడిలా కాపాడుకోవాల్సిన మన కేసీఆర్ ఏడికిపోయిండు? రెండేండ్లకోసారి నామినేటెడ్ పోస్టులు భర్తీచేసినా పదేండ్లలో 30 వేల మందికి అవకాశం దక్కేది. ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడే కేసీఆర్‌కు అమ్మతనం.. మమకారం పోయింది. నా బిడ్డగానీ, కొడుకుగానీ తప్పు చేస్తే పార్టీలకెల్లి తీసిపారేస్తా అని ఆనాటి కేసీఆర్ అన్నడు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని నేను చెప్తే.. నన్నే బయటేసిన్రు. అవినీతి చేసిన పందికొక్కులను మాత్రం పక్కన పెట్టుకున్నడు. కాబట్టే ఆయన మన కేసీఆరే కాదు.. ఆత్మలేని మరబొమ్మ కేసీఆర్. మన కేసీఆర్అయితే కళ్లెత్తి చూసే ధైర్యం కూడా ఉండకుండే. కాళ్లు మొక్కే తత్వం ఉంటుండే. అందుకే ఎదురు నిలబడి కొట్లాడుతున్నా.. యుద్ధం చేస్తున్నా’’ అని ఆమె అన్నారు. బీఆర్‌ఎస్ ఎన్నో తప్పులు చేస్తున్నదని, ఇల్లు ఇప్పుడే అలికినమని, ముందుంది ముసళ్ల పండుగ అని వ్యాఖ్యానించారు.

