హైదరాబాద్, వెలుగు: దేశానికి కొత్త రాజకీయ శక్తులు అవసరమని తమిళనాడు ఫలితాలు స్పష్టం చేశాయని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత అన్నారు. తమిళనాడు ఎన్నికల్లో సినీ హీరో విజయ్ పార్టీ టీవీకే సాధించిన మెజారిటీపై ఆమె సోమవారం స్పందించారు. తెలంగాణలోనూ కొత్త రాజకీయ శక్తులే ప్రత్యామ్నాయమవుతాయని ఆమె పరోక్షంగా ‘ఎక్స్’లో పెట్టిన పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘‘ఉన్నవాళ్లతో విసిగిపోయాం. అధికార దాహార్తులతో వేసారి పోయాం.
భ్రష్టుపట్టిపోయిన ఈ రాజకీయ చరిత్రను తిరగ రాయడానికి ‘కొత్త రాజకీయ శక్తులు’ అవసరమని దేశానికి తమిళ ప్రజలు ఒక సంకేతం పంపారు’’ అని పేర్కొన్నారు. కాగా, మొక్కజొన్న పంట కాలిపోయి ఆగమైన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కవిత మరో ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కనుగుట్టలో ప్రమాదవశాత్తు వంద ఎకరాలకు పైగా మొక్కజొన్న పంట దహనం అవడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
నష్టపోయిన రైతులతో ఆమె ఫోన్లో మాట్లాడారు. బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, టీఆర్ఎస్ నాయకులు బానోత్ మౌనికతో కలిసి బాధిత రైతులతో ఫోన్ లో మాట్లాడారు. రైతులు ధైర్యంగా ఉండాలని, పంట నష్టం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేలా ఒత్తిడి చేస్తామని ధైర్యం చెప్పారు. ప్రభుత్వం వెంటనే బాధితులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని
డిమాండ్ చేశారు.
8న ‘పాలమూరు రంగారెడ్డి’ ప్రాజెక్ట్ సాధన సభ..
టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తర్వాత కవిత పాలమూరు గడ్డ మీది నుంచి రాజకీయంగా మొదటి అడుగు వేయనున్నారు. పార్టీ స్థాపించిన తర్వాత జోగుళాంబ అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ముందుకు సాగుతానని ప్రకటించిన కవిత.. అందుకు అనుగుణంగా ఈ నెల 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కృష్ణా జలాల సాధనపై పోరాటం చేయనున్నారు. 8న ఉదయం జోగుళాంబ అమ్మవారిని దర్శనం చేసుకుని.. అదే రోజు సాయంత్రం పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రతిపాదించిన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సమీపంలోని చౌదరిగూడెం వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. ‘పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సాధన సభ’ పేరిట నిర్వహించే సభలో మాట్లాడనున్నారు. కవిత సభకు సంబంధించి సోమవారం హైదరాబాద్‌లోని జాగృతి ఆఫీస్‌లో టీఆర్ఎస్ పార్టీ నేతలు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నవీన్ ఆచారి పాల్గొన్నారు.
