రాహుల్ పేపర్ పులి.. ఎన్నికల టైంలోనే టూరిస్టులా వస్తడు: కవిత

రాహుల్ పేపర్ పులి.. ఎన్నికల టైంలోనే టూరిస్టులా వస్తడు: కవిత
  • రాష్ట్ర లీడర్లు రాసిచ్చిన స్క్రిప్టు చదివి నవ్వులపాలవుతున్నడు
  • ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సీనియారిటీ ఉంది తప్ప సిన్సియారిటీ లేదని కామెంట్

మెట్ పల్లి, వెలుగు : రాహుల్​ బబ్బర్​షేర్​ కాదు. పేపర్​ షేర్. ఆయన ఎలక్షన్ గాంధీ. ఎన్నికల టైంలోనే టూరిస్ట్‌‌‌‌లా వచ్చి, రాష్ట్ర లీడర్లు రాసిచ్చిన స్ర్కిప్టు చదివి నవ్వులపాలవుతున్నారు’’ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణతో ప్రత్యేక అనుబంధం ఉందని అంటున్న రాహుల్​గాంధీ.. ఏడు మండలాలను ఏపీలో కలిపినప్పుడు ఎందుకు స్పందించలేదని ఆమె ప్రశ్నించారు. శనివారం జగిత్యాల జిల్లా మెట్‌‌‌‌పల్లిలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌రావు నివాసంలో మీడియాతో కవిత మాట్లాడారు.

కాంగ్రెస్  లీడర్ల మోసపూరిత మాటలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. కాంగ్రెస్‌‌‌‌కు ఓటు వేస్తే రైతులకు 3 గంటలకు మించి కరెంట్​ రాదన్నారు. కాంగ్రెస్  హయాంలో ఉమ్మడి కరీంనగర్  జిల్లాలో ఒకే ఒక్క బీసీ సంక్షేమ హాస్టల్ ఉండేదని, తమ ప్రభుత్వం 34 బీసీ సంక్షేమ హాస్టళ్లు ఏర్పాటు చేసిందని చెప్పారు. వాటిని చూసి ఎమ్మెల్సీ జీవన్  రెడ్డి, రాహుల్ గాంధీ తమ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారని నిలదీశారు. బీఆర్ఎస్​ వస్తే బతుకమ్మ మీద గౌరమ్మ బదులు ఇంకేదో పెట్టుకుని పండగ చేసుకోవాల్సి వస్తుందని జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారని, ఆయన వయస్సుకు, ఆయన మాట్లాడుతున్న మాటలకు పొంతన లేదన్నారు.

బతుకమ్మను అవమానించిన జీవన్  రెడ్డికి సీనియారిటీ ఉంది తప్ప సిన్సియారిటీ లేదని విమర్శించారు. ఇక నిజాం షుగర్  ఫ్యాక్టరీలను మూసివేసిన పాపం కాంగ్రెస్, బీజేపీకే దక్కుతుందని ఆమె ఆరోపించారు. 2002లో ఫ్యాక్టరీలను టీడీపీ 51 శాతం అమ్మినప్పుడు కాంగ్రెస్​వేడుక చూసిందని మండిపడ్డారు. దేశంలో ప్రైవేటు కంపెనీలకు బొగ్గు అమ్ముకోవచ్చని నేర్పించి దానిని ఆనవాయితీగా చేసిన ఘనత కాంగ్రెస్​కే దక్కుతుందని ఫైర్‌‌‌‌‌‌‌‌  అయ్యారు. తాడిచెర్ల బొగ్గు గనిని ప్రైవేట్ వాళ్లకు కాంగ్రెస్  అప్పగించిందని విమర్శించారు. సింగరేణి ప్రైవేటుపరం కాకుండా కేసీఆర్  సర్కారు అడ్డుకుందన్నారు.