హైదరాబాద్, వెలుగు: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హైబీపీతో బాధపడుతున్నారు. సోమవారం శాసనమండలిలో భావోద్వేగపూరితమైన స్పీచ్ తర్వాత.. ఆమె అనారోగ్యానికి గురయ్యారు. ఇంటికెళ్లాక ఆమె కొంత అసౌకర్యానికి లోనయ్యారు. అయితే, కొన్ని రోజులుగా జాగృతి జనంబాట కార్యక్రమంలో పాల్గొంటున్న కవిత ఇప్పటికే జ్వరంతో బాధపడుతున్నారు. దానికితోడు మండలిలో ఆమె ఎమోషనల్ కావడం, ఉద్వేగంతో మాట్లాడడం వల్ల ఆమెకు బీపీ పెరిగిందని జాగృతి వర్గాలు చెబుతున్నాయి. సాయంత్రం ఇద్దరు డాక్టర్లు కవిత ఇంటికి వెళ్లి ఆమెను పరీక్షించగా బీపీ150/110గా ఉన్నట్టు తేలింది.
ఎక్కువగా ఆలోచించొద్దని, ఎమోషనల్ అవ్వొద్దని కవితకు డాక్టర్లు సూచించినట్టు తెలిసింది. రెండు మూడురోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పినట్టు సమాచారం. కాగా, జైల్లో ఉన్నప్పుడు కవితకు బీపీ ఎటాక్ అయిందని, అప్పుడు బీపీ టాబ్లెట్లు వాడేవారని జాగృతి వర్గాలు అంటున్నాయి. ఆ తర్వాత కొన్నాళ్లు మళ్లీ నార్మల్ స్టేజ్‌కు వచ్చినా.. తాజాగా మళ్లీ హైలెవెల్‌కు వెళ్లిందని చెబుతున్నారు.
