V6 News

కవిత పార్టీ టీఆర్ఎస్సే.. కానీ తెలంగాణ రక్షణ సేన.. ఇటీవల ఆవిర్భావ సభలో ‘తెలంగాణ రాష్ట్ర సేన’గా ప్రకటన

కవిత పార్టీ టీఆర్ఎస్సే.. కానీ తెలంగాణ రక్షణ సేన.. ఇటీవల ఆవిర్భావ సభలో ‘తెలంగాణ రాష్ట్ర సేన’గా ప్రకటన
  • టీఆర్ఎస్ తనకు రాసిపెట్టుందేమో అంటూ కవిత పోస్ట్
  • ‘తెలంగాణ రక్షణ సేన’కు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి

హైదరాబాద్, వెలుగు: కవిత పార్టీ పేరు కొంత మారింది. ఏప్రిల్ 25న భారీ ఆవిర్భావ సభను ఏర్పాటు చేసి తన పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్​ఎస్​)’గా కవిత ప్రకటించినా.. ఎన్నికల సంఘానికి మాత్రం వేరే పేర్లతో దరఖాస్తు చేశారు. ఆ పేర్లలో ఒకటైన ‘తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)’కు ఎన్నికల సంఘం తాజాగా అనుమతిచ్చింది. ఆ పేరుపై అభ్యంతరాల కోసం పబ్లిక్​ నోటీసులు ఇవ్వాలని కవితకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖను పంపింది. 

ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు గురువారం ఆ లేఖను.. కవితకు ఆమె నివాసంలో అందజేశారు. గత నెల 23న.. అంటే పార్టీ ప్రకటనకు రెండు రోజుల ముందు ఐదు పేర్లను ప్రతిపాదిస్తూ ఎన్నికల సంఘానికి కవిత లేఖ రాశారు. ఆ ఐదు పేర్లలో.. ఇటీవల సభలో ప్రకటించిన ‘తెలంగాణ రాష్ట్ర సేన’ను పేర్కొనక పోవడం గమనార్హం. అంతేకాదు.. ఆమె తెలంగాణ జాగృతి బదులు.. ‘తెలంగాణ ప్రజా జాగృతి’ అధ్యక్షురాలిగా ఆ లేఖను ఈసీకి పంపించారు. 

అందులో ‘తెలంగాణ ప్రజా జాగృతి’, ‘తెలంగాణ జాగృతి’, ‘తెలంగాణ రక్షణ సేన’, ‘తెలంగాణ రాష్ట్ర జాగృతి’, ‘తెలంగాణ ప్రజా శక్తి’ పేర్లను కవిత ప్రతిపాదించారు. ఆ ఐదు పేర్లలో ఏదో ఒకపేరును తమ పార్టీకి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కానీ జాబితాలో మూడో పేరైన ‘తెలంగాణ రక్షణ సేన’కే ప్రాధాన్యం ఇవ్వాలని ఎన్నికల సంఘం అధికారులను కవిత మౌఖికంగా కోరినట్టు తెలుస్తున్నది. అందులో భాగంగానే తాజాగా ఎన్నికల సంఘం.. ఆ పేరుపై అభ్యంతరాల స్వీకరణ కోసం పబ్లిక్​ నోటీసులు ఇవ్వాలని ఆదేశిస్తూ ‘ఏప్రిల్ 28’వ తేదీతో లేఖ పంపింది.

  • 30 రోజుల్లోపు అభ్యంతరాలు..

తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేరును అధికారికంగా కవితకు కేటాయించాలంటే.. ప్రజల నుంచి అభ్యంతరాలు ఉండకూడదని ఎన్నికల సంఘం లేఖలో పేర్కొంది. అందుకుగానూ వరుసగా రెండు రోజులు రెండు జాతీయ పత్రికలు, రెండు స్థానిక పత్రికల్లో పబ్లిక్​ నోటీసులు ఇవ్వాలని సూచించింది. జాతీయ పత్రికలైతే ఒక హిందీ, ఒక ఇంగ్లీష్​, లోకల్ పత్రికలైతే ఒక స్థానిక ఇంగ్లీష్​ పత్రిక, ఒక తెలుగు పత్రికలో పబ్లిక్ నోటీసు ఇవ్వాలని పేర్కొంది.

 ఏ4 సైజులో ప్రకటన ఉండాలని స్పష్టం చేసింది. ఈ లేఖ అందిన తేదీ నుంచి 30 రోజుల్లోగా.. పబ్లిక్ నోటీసులు ఇచ్చిన 8 పేపర్లను ఎన్నికల సంఘానికి పంపాలని పేర్కొంది. అదే విధంగా పబ్లిక్ నోటీసులు ఇచ్చిన తేదీ నుంచి నెల రోజుల్లోగా అభ్యంతరాలున్న వాళ్లు.. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ ద్వారా పంపాలని సూచించింది. 

పబ్లిక్ నోటీసుల ఆధారంగా ఎవరైనా అభ్యంతరాలు తెలిపితే దానిపై విధిగా విచారణ జరిపిన తర్వాతే పేరును కేటాయిస్తామని పేర్కొంది. అనెగ్జర్ 1 ప్రకారం ఎన్నికల సంఘం వెబ్​సైట్​లో పార్టీ పేరుకు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని, పార్టీ రాజ్యాంగాన్ని అప్​లోడ్ చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. 30 రోజుల్లోగా వివరాలు పంపకపోతే.. ‘తెలంగాణ రక్షణ సేన’ పేరు రిజిస్ట్రేషన్​ను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. 

  • టీఆర్ఎస్.. నాకు రాసి పెట్టుందేమో: కవిత

ఎన్నికల సంఘం లేఖపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత స్పందించారు. ‘టీఆర్ఎస్’ పేరు తనకు రాసి పెట్టుందేమో అంటూ ‘ఎక్స్’లో పోస్ట్​ చేశారు. ‘‘తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని సమస్త తెలంగాణ సమాజానికి తెలియజేయడానికి సంతోషిస్తున్నా. రెండు దశాబ్దాలుగా తెలం గాణ సాంస్కృతిక పరిరక్షణ, పునరుజ్జీవం కోసం నేను చేసిన కృషిని కొనసాగిస్తూ, ఇక ముందు కూడా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా అంకితభావంతో పని చేస్తానని తెలియజేస్తున్నాను. జనవరి 2026లో జాతీయ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఐదు పేర్లతో దరఖాస్తు చేసుకున్నాం. అందులో మూడో ప్రాధాన్యతగా మేము ఇచ్చిన పేరును ఈసీ ఆమోదించడం కేవలం యాదృచ్ఛికం. టీఆర్ఎస్ నాకు రాసిపెట్టుందేమో’’ అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.